పాక్‌, బంగ్లాదేశ్ కంటే భారత్‌ దిగువకు

ప్రపంచ వ్యాప్తంగా ఆకలి స్థాయులు, పోషకాహార లోపాలను సూచించే ప్రపంచ ఆకలి సూచిక(జీహెచ్‌ఐ)లో భారత్ 94వ స్థానంలో నిలిచింది.

Published : 18 Oct 2020 03:21 IST

ఆకలి సూచీలో 94వ స్థానం

దిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా ఆకలి స్థాయులు, పోషకాహార లోపాలను సూచించే ప్రపంచ ఆకలి సూచిక(జీహెచ్‌ఐ)లో భారత్ 94వ స్థానంలో నిలిచింది. 107 దేశాల జాబితాలో భారత్ స్థానమది. పొరుగున ఉన్న పాకిస్థాన్‌(88), నేపాల్‌(73), బంగ్లాదేశ్‌(75), శ్రీలంక(64) కంటే భారత్ పరిస్థితి మరీ తీసికట్టుగా ఉంది. రువాండా, నైజీరియా, అఫ్గానిస్థాన్‌, లైబీరియా, మొజాంబిక్, చాడ్ వంటి 13 దేశాలే మనదేశం కంటే అధ్వాన స్థితిలో ఉండటం గమనార్హం. జీహెచ్‌ఐ వార్షిక నివేదికను కన్‌సర్న్‌ హంగర్‌, వెల్తుంగర్‌ హిల్ఫ్‌ సంస్థలు సంయుక్తంగా ప్రచురించాయి.

ఆ నివేదిక ప్రకారం..దేశ జనాభాలో 14 శాతం మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. 27.2 పాయింట్లతో భారత్ ‘తీవ్రమైన’ విభాగంలో ఉంది. చిన్నపిల్లల స్టటింగ్ రేట్(ఎదుగుదల లోపం) కూడా 37.4గా ఉన్నట్లు తెలిపింది. వయసుకు తగ్గ ఎత్తు లేకపోవడం, దీర్ఘకాలిక పోషకాహార లోపంతో బాధపడేవారిని స్టంటెడ్ చిల్డ్రన్‌గా చెబుతారు. ‘1991 నుంచి 2014 వరకు బంగ్లాదేశ్‌, భారత దేశం, నేపాల్, పాకిస్థాన్‌ దేశాల్లో పిల్లల్లో ఎదుగుదల లోపానికి(స్టంటెడ్‌) ఆహారంలో వైవిధ్యం, పేదరికం, తక్కువ స్థాయి మెటర్నల్ ఎడ్యుకేషన్ ప్రధాన కారణాలు’ అని నివేదిక వెల్లడించింది. చాలా దేశాల్లో పరిస్థితి చాలా నెమ్మదిగా మెరుగుపడుతోందని చెప్పగా.. మరికొన్నింటిలో దిగజారుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. మితమైన, తీవ్రమైన లేక భయంకరమైన విభాగాల్లోని 46 దేశాల ఆకలి సూచీ మెరుగుపడిందని తెలిపింది. కానీ, ఆ విభాగాల్లోని 14 దేశాల పరిస్థితి మాత్రం మరింత అధ్వానంగా తయారైందని పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని