ఆ మెడికల్‌ డిగ్రీలు పనిచేయవు..

పాక్‌ ఆక్రమిత కశ్మీరు ప్రాంతంలోని వైద్య కళాశాలలు ఇచ్చే డిగ్రీలను గుర్తించబోమని భారత ప్రభుత్వం ప్రకటించింది.

Published : 14 Aug 2020 13:28 IST

పాక్‌కు షాకిచ్చిన భారత్‌

దిల్లీ: పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ ప్రాంతంలోని వైద్య కళాశాలలు ఇచ్చే డిగ్రీలను గుర్తించబోమని భారత ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (ఎంసీఐ) ఓ అధికారిక ప్రకటన వెలువరించింది. వివరాలు ఇలా ఉన్నాయి... పీఓకేలో మెడిసిన్‌ చదివిన ఓ కశ్మీర్‌కు చెందిన ఓ విద్యార్థిని తన వైద్యవిద్యకు గుర్తింపు లభించకపోవటంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో.. ఆయా ప్రాంతాల్లో చదివే విద్యార్థులు వైద్యవిద్య ప్రాక్టీసు చేసేందుకు అనుమతించే విషయమై పునరాలోచించాలని జమ్ము కశ్మీర్‌ హైకోర్టు భారత ప్రభుత్వానికి గత డిసెంబర్‌లో సూచించింది.

ఇందుకు స్పందించిన ఎంసీఐ ‘‘జమ్ము కశ్మీర్‌, లద్దాఖ్‌లోని మొత్తం భూభాగాలు భారతదేశంలో అంతర్భాగం. పాకిస్థాన్‌‌ అక్రమంగా, దౌర్జన్యంగా ఈ భూభాగంలో కొంత ప్రాంతాన్ని ఆక్రమించింది. పాక్‌ ఆక్రమిత జమ్ము కశ్మీర్‌, లద్దాఖ్‌ ప్రాంతంలోని ఏ వైద్యవిద్యా సంస్థకైనా భారత ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. అయితే అక్కడున్న ఏ విద్యాసంస్థకు అనుమతి మంజూరు కాలేదు. అందువల్ల, ఆయా వైద్య కళాశాలల నుంచి పొందిన మెడికల్‌ డిగ్రీని పొందిన ఏ వ్యక్తికీ.. ఇండియన్‌ మెడికల్‌ కౌన్సిల్‌ యాక్ట్‌ 1956 ప్రకారం భారత్‌లో ప్రాక్టీస్‌ చేసేందుకు అనుమతి లేదు.’’ అని స్పష్టం చేసింది.

పాక్ ప్రధాని ‘ఇమ్రాన్‌ ఖాన్‌ స్కాలర్‌ షిప్‌’ పేరిట పాక్‌ ప్రతి సంవత్సరం పీఓకేలోని 1600 మంది విద్యార్థులకు ఉపకార వేతనాన్ని అందిస్తోంది. అంతేకాకుండా వేర్పాటువాదుల ప్రోద్బలంతో, కశ్మీరు యువతకు తమ దేశంలో తక్కువ ఖర్చుతో విద్యనందిస్తోంది. అయితే ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్న పలువురు విద్యార్థులు వేర్పాటు వాదులుగా తయారై భారత్‌కు తిరిగి వస్తున్నారని భారత భద్రతా వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ తాజా నిర్ణయం.. పలు సమస్యలకు చెక్ పెడుతుందని వారు హర్షం వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని