న్యూజిలాండ్‌లో జసిండా ఆర్డెర్న్‌ జయకేతనం

న్యూజిలాండ్‌ సార్వత్రిక ఎన్నికల్లో సెంటర్‌ లెఫ్ట్‌ లేబర్‌ పార్టీ ఘన విజయం సాధించింది. ప్రధాని జసిండా ఆర్డెర్న్‌ నేతృత్వంలోని ఆ పార్టీ అపూర్వ విజయం సొంతం చేసుకుంది. కొవిడ్‌ మహమ్మారి కట్టడిలో దూకుడుగా ........

Updated : 17 Oct 2020 18:51 IST

ఆక్లాండ్‌: న్యూజిలాండ్‌ సార్వత్రిక ఎన్నికల్లో సెంటర్‌ లెఫ్ట్‌ లేబర్‌ పార్టీ ఘన విజయం సాధించింది. ప్రధాని జసిండా ఆర్డెర్న్‌ నేతృత్వంలోని ఆ పార్టీ అపూర్వ విజయం సొంతం చేసుకుంది. కొవిడ్‌ మహమ్మారి కట్టడిలో దూకుడుగా వ్యవహరించిన ఆమెకు అక్కడి ప్రజలు రెండోసారి ఘన విజయం అందించారు. 70శాతం ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి ప్రధాన ప్రత్యర్థి జుడిత్ కాలిన్స్‌ ఓటమిని అంగీకరించడం గమనార్హం. మూడింట రెండొంతుల ఓట్లు లెక్కించే సరికే ఆర్డెర్న్‌కు చెందిన లేబర్‌ పార్టీ 49.2శాతం ఓట్లను సాధించింది. మొత్తం 120 సభ్యులు ఉన్న పార్లమెంట్‌లో లేబర్‌ పార్టీ 64సీట్లు సొంతం చేసుకుంటుందని భావిస్తున్నారు. న్యూజిలాండ్‌లో 1996లో దామాషా పద్ధతిలో ఓటింగ్‌ వ్యవస్థను ప్రవేశపెట్టిన తర్వాత పూర్తి స్థాయి ఏ పార్టీకీ మెజార్టీ దక్కలేదు. ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి ఉండేది. కానీ తాజా ఎన్నికల్లో లేబర్‌ పార్టీకి న్యూజిలాండ్‌ ప్రజలు తొలిసారి పూర్తి మెజార్టీని కట్టబెడుతూ సంచలన విజయం అందించారు.

దాదాపు 77శాతం బ్యాలెట్లను లెక్కించగా.. లేబర్‌ పార్టీకి 49శాతం ఓట్లు రాగా.. నేషనల్‌ పార్టీకి 27శాతం ఓట్లు వచ్చినట్టు ఎన్నికల కమిషన్‌ వెల్లడించింది. ప్రతిపక్ష నేత జుడిత్‌ కాలిన్స్‌ తన ఓటమిని అంగీకరిస్తూ జసిండాకు ఫోన్‌ చేశారు. అనంతరం ఆమె తన నివాసం నుంచి బయటకు వచ్చి అక్కడిక భారీగా చేరుకున్న మద్దతుదారులకు అభివాదం చేశారు. వారిని ఉద్దేశించి ప్రసంగించిన ఆమె.. గత 50 ఏళ్లలో ఎవరికీ ఇవ్వనంత మద్దతు తమ పార్టీకి అందించారన్నారు. ఈ ఎన్నికల్లో నేషనల్‌ పార్టీకి దాదాపు 35 స్థానాలు మాత్రమే వచ్చే అవకాశం ఉంది. గత 20 ఏళ్లలో ఆ పార్టీకి వచ్చిన అత్యంత నిరాశాజనక ఫలితాలివేనని విశ్లేషకులు పేర్కొంటున్నారు. 2017లో తొలిసారి ప్రధానిగా ఎన్నికైన తర్వాత జసిండా ఆర్డెర్న్‌ పలు సమస్యల పట్ల వ్యవహరించిన తీరుపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వచ్చాయి. చర్చిలపై దాడులు, కరోనా సమయంలో ఆమె అద్భుతంగా పనిచేశారంటూ ప్రపంచ నేతలు కొనియాడారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని