నడ్డా కాన్వాయ్‌పై దాడి: బంగాల్‌ డీజీపీకి సమన్లు

భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్‌పై రాళ్ల దాడి నేపథ్యంలో పశ్చిమబంగాల్‌లో శాంతి భద్రతల పరిస్థితులపై కేంద్ర హోంశాఖ ఆ రాష్ట్ర డీజీపీ, చీఫ్‌ సెక్రటరీకి సమన్లు జారీ చేసింది. డిసెంబరు 14న హోంశాఖ

Updated : 11 Dec 2020 14:47 IST

దిల్లీ: భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్‌పై రాళ్ల దాడి నేపథ్యంలో పశ్చిమబంగాల్‌లో శాంతి భద్రతల పరిస్థితులపై కేంద్ర హోంశాఖ ఆ రాష్ట్ర డీజీపీ, చీఫ్‌ సెక్రటరీకి సమన్లు జారీ చేసింది. డిసెంబరు 14న హోంశాఖ కార్యదర్శి ఎదుట హాజరుకావాలని ఆదేశించింది.

జేపీ నడ్డా పశ్చిమబెంగాల్‌లో పర్యటిస్తున్న సమయంలో ఆయన కాన్వాయ్‌పై రాళ్ల దాడి జరిగిన విషయం తెలిసిందే. గురువారం ఉదయం కోల్‌కతా నుంచి 24 పరగణాల జిల్లాలోని డైమండ్‌ హార్బర్‌లో పార్టీ కార్యకర్తల సమావేశానికి నడ్డా వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. మోటారుసైకిళ్లపై వచ్చిన కొందరు దుండగులు ఇటుకలకు, రాళ్లు, కర్రలతో వాహనశ్రేణిపై దాడి చేసినట్లు ప్రత్యక్ష సాక్ష్యులు చెప్పారు. కాగా.. ఈ దాడికి పాల్పడింది తృణమూల్‌ కార్యకర్తలే అని భాజపా ఆరోపించగా.. అంతా నాటకమంటూ బంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కొట్టిపారేయడం గమనార్హం. 

నడ్డా కాన్వాయ్‌పై దాడిని బంగాల్‌ గవర్నర్‌ జగ్‌దీప్‌ ధన్‌కర్‌ తీవ్రంగా ఖండించారు. ఘటనపై కేంద్రహోంశాఖకు నివేదిక పంపారు. నడ్డా పర్యటనకు భద్రత కల్పించడంలో తృణమూల్‌ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. స్థానిక పోలీసులు ప్రొటొకాల్‌ పాటించకపోవడం వల్లే ఘటన జరిగిందని అన్నారు. నడ్డా పర్యటన గురించి స్థానిక పోలీసులకు ముందస్తు సమాచారం ఉన్నప్పటికీ పోలీసులు భద్రత కల్పించలేదని గవర్నర్‌ నివేదికలో పేర్కొన్నారు. మరోవైపు దాడిపై కేంద్ర హోంశాఖ బంగాల్‌ ప్రభుత్వాన్ని కూడా నివేదిక అడిగింది. 

కోల్‌కతాకు అమిత్‌షా!

ఇదిలా ఉండగా.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా త్వరలోనే పశ్చిమబంగాల్‌ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 19, 20వ తేదీల్లో ఆయన కోల్‌కతాలో పర్యటించనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. నడ్డా వాహనశ్రేణిపై రాళ్ల దాడి నేపథ్యంలో అమిత్ షా పర్యటన వార్తలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 

ఇవీ చదవండి..

నడ్డా కాన్వాయ్‌పై రాళ్ల దాడి

వారు నియంతల్లా వ్యవహరిస్తున్నారు: మమత


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని