వ్యాక్సిన్‌ ప్రయోగాలపై హ్యాకర్ల కన్ను

ప్రపంచాన్ని గజగజలాడిస్తున్న కొవిడ్‌ మహమ్మారిని అరికట్టేందుకు శాస్త్రవేత్తలు, పరిశోధకులు వ్యాక్సిన్‌ ప్రయోగాలు ముమ్మరంగా జరుపుతుండగా.. వీటిపై హ్యాకర్ల కన్ను పడింది. ప్రముఖ ఫార్మా కంపెనీలు, వ్యాక్సిన్‌ పరిశోధకుల నుంచి విలువైన

Updated : 14 Nov 2020 14:28 IST

రష్యా, ఉత్తరకొరియా సైబర్‌ నేరగాళ్లను గుర్తించిన మైక్రోసాఫ్ట్‌

బోస్టన్‌: ప్రపంచాన్ని గజగజలాడిస్తున్న కొవిడ్‌ మహమ్మారిని అరికట్టేందుకు శాస్త్రవేత్తలు, పరిశోధకులు వ్యాక్సిన్‌ ప్రయోగాలు ముమ్మరంగా జరుపుతుండగా.. వీటిపై హ్యాకర్ల కన్ను పడింది. ప్రముఖ ఫార్మా కంపెనీలు, వ్యాక్సిన్‌ పరిశోధకుల నుంచి విలువైన డేటాను చోరీ చేసేందుకు రష్యా, ఉత్తరకొరియా హ్యాకర్లు ప్రయత్నించినట్లు మైక్రోసాఫ్ట్‌ గుర్తించింది. ఈ మేరకు ఐటీ సంస్థ తన బ్లాగులో పేర్కొంది. 

భారత్‌, కెనడా, దక్షిణకొరియా, అమెరికాలోని కరోనా వ్యాక్సిన్‌ ప్రయోగాలను లక్ష్యంగా చేసుకుని వీరు హ్యాకింగ్‌కు యత్నించినట్లు మైక్రోసాఫ్ట్‌ వెల్లడించింది. చాలా వరకు హ్యాకర్లు విఫలమైనట్లు తాము గుర్తించామని స్పష్టం చేసింది. అయితే ఎంతమంది హ్యాకర్లు డేటా చోరీకి పాల్పడ్డారో, వారు ఎంత ప్రమాదకరమనేది తమ వద్ద ఎలాంటి సమాచారం లేదని తెలిపింది. రష్యా  మిలిటరీ ఏజెంట్స్‌కు చెందిన ఫ్యాన్సీ బీర్‌, ఉత్తరకొరియాకు చెందిన లజారస్‌ గ్రూప్‌ వంటివి హ్యాకింగ్‌కు యత్నించినట్లు మైక్రోసాఫ్ట్‌ వెల్లడించింది. ఫార్మా కంపెనీలు, వ్యాక్సిన్‌ పరిశోధకులు లాగిన్‌ వివరాలను చోరీ చేసేందుకు ప్రయత్నాలు జరిగినట్లు తెలిపింది. 

ఈ ఏడాది జులైలో అమెరికా ప్రభుత్వం కూడా హ్యాకింగ్‌ ఆరోపణలు చేసింది. చైనా మద్దుతు కలిగిన హ్యాకర్లు తమ వ్యాక్సిన్‌ తయారీదారులను లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించిన ట్రంప్‌ సర్కార్‌.. వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయనున్నట్లు ప్రకటించింది. కాగా.. మైక్రోసాఫ్ట్‌ అధ్యక్షుడు బ్రాడ్‌ స్మిత్‌ కూడా సైబర్‌ దాడుల గురించి హెచ్చరించారు. సైబర్‌ దాడుల నుంచి ప్రపంచ దేశాలు తమ ఆరోగ్య సంరక్షణా సంస్థలకు  రక్షణ కల్పించాల్సిన అవసరం ఏర్పడిందని స్మిత్‌ చెప్పారు. 

ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌ రెండో దఫా విజృంభణ మొదలైన విషయం తెలిసిందే. అగ్రరాజ్యం అమెరికా సహా ఐరోపా దేశాల్లో కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనాను ఎదుర్కొనేందుకు తమ వ్యాక్సిన్‌ 90శాతం ప్రభావవంతంగా పనిచేస్తోందని ఫైజర్‌ సంస్థ ప్రకటించడం యావత్‌ ప్రపంచానికి ఊరట కలిగిస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని