‘రైతుల కోసం ఉరికంబం ఎక్కడానికైనా సిద్ధం’

ధైర్యముంటే తనను అరెస్టు చేయాలంటూ బిహార్‌ ప్రతిపక్ష నాయకుడు, ఆర్జేడీ అధినేత తేజస్వీ యాదవ్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌కు సవాల్‌ విసిరారు. దిల్లీలో ఆందోళన చేస్తున్న రైతులకు సంఘీభావంగా శనివారం తేజస్వీ యాదవ్ మహాకూటమి......

Updated : 06 Dec 2020 19:43 IST

ఆర్జేడీ అధ్యక్షుడు తేజస్వీ యాదవ్‌

పట్నా: ధైర్యముంటే తనను అరెస్టు చేయాలంటూ బిహార్‌ ప్రతిపక్ష నాయకుడు, ఆర్జేడీ అధ్యక్షుడు తేజస్వీ యాదవ్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌కు సవాల్‌ విసిరారు. దిల్లీలో ఆందోళన చేస్తున్న రైతులకు సంఘీభావంగా శనివారం తేజస్వీ యాదవ్ మహాకూటమి నేతలతో కలిసి బిహార్‌లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. దీంతో కొవిడ్‌ నిబంధనల్ని ఉల్లంఘించారంటూ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. దీన్ని తీవ్రంగా ఖండించిన ఆయన రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ముఖ్యమంత్రి ఒక పిరికిపంద అంటూ ఘాటు విమర్శలు చేశారు. రైతుల కోసం ఉరికంభం ఎక్కడానికైనా తాను సిద్ధంగా ఉన్నానన్నారు. 

‘‘రైతుల కోసం పోరాడుతున్న మాపై ఓ పిరికిపంద నేతృత్వంలోని ప్రభుత్వం కేసులు నమోదు చేసింది. నిజంగా మీ చేతిలో అధికారమే ఉంటే నన్ను అరెస్టు చేయండి. లేదంటే నేనే లొంగిపోతా. రైతుల కోసం ఉరికంభం ఎక్కడానికైనా సిద్ధం’’ అని తేజస్వీ యాదవ్‌ ట్వీట్‌ చేశారు. అధికారంలో ఉన్న ఎన్డీయేపై ఆర్జేడీ తీవ్ర స్థాయిలో మండిపడింది. రైతులకు మద్దతుగా నిలిచినందుకు తమ నేతపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు.

కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గత పది రోజులుగా రైతులు దిల్లీ సరిహద్దుల్లో ఆందోళన కార్యక్రమాలు చేపట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే కేంద్రంతో రైతు సంఘాలు పలు దఫాలు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. డిసెంబరు 9న మరోసారి చర్చలు జరపనున్నారు. ముందు పిలుపునిచ్చినట్లుగా డిసెంబరు 8న భారత్‌ బంద్‌ నిర్వహించనున్నారు.

ఇవీ చదవండి..
రైతుల ఆందోళన.. పార్లమెంటు ప్రత్యేక సమావేశం

భారత్‌ బంద్‌కు తెరాస సంపూర్ణ మద్దతు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని