అమెరికాలోనూ మింక్‌లలో కరోనా

డెన్మార్క్‌లో మింక్‌ అనే జీవి నుంచి కరోనా వైరస్‌ మనుషులకు వ్యాప్తి చెందినట్టు వచ్చిన వార్తలు కలకలం రేపిన విషయం తెలిసిందే. అయితే, ఒక్క డెన్మార్క్‌లోనే కాకుండా మరో ఐదు దేశాల్లో కూడా మింక్‌ ఫాంలలో.........

Updated : 07 Nov 2020 18:25 IST

6 దేశాల్లోని మింక్‌లలో ఉన్నట్టు WHO ప్రకటన

జెనీవా‌: డెన్మార్క్‌లో మింక్‌ అనే జీవి నుంచి కరోనా వైరస్‌ మనుషులకు వ్యాప్తి చెందినట్టు వచ్చిన వార్తలు కలకలం రేపిన విషయం తెలిసిందే. అయితే, ఒక్క డెన్మార్క్‌లోనే కాకుండా మరో ఐదు దేశాల్లో కూడా మింక్‌ ఫాం‌లలో ఈ వైరస్‌ ఉన్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. డెన్మార్క్‌, అమెరికాతో పాటు ఇటలీ, నెదర్లాండ్స్‌,  స్పెయిన్‌, స్వీడన్‌లలోనూ మింక్‌ ఫాంలలో కరోనా వైరస్‌ బయటపడినట్టు డబ్ల్యూహెచ్‌వో ఓ ప్రకటనలో తెలిపింది. ఈ వైరస్‌ సోకిన వారిలో చికిత్సలో వస్తున్న ప్రాథమిక ఫలితాలను అంచనా వేస్తూ తదుపరి పరిశోధనలకు డబ్ల్యూహెచ్‌వో పిలుపునిచ్చింది. డెన్మార్క్‌లో మింక్‌ల నుంచి కరోనా వ్యాప్తి చెందుతోందంటూ స్టేటెన్స్‌ సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ చేసిన హెచ్చరికలతో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది. కొవిడ్‌ నిబంధనలను మరింత కఠినతరం చేసింది. రూపం మార్చుకున్న కరోనా వైరస్‌ మింక్‌ల నుంచి తాజాగా 12మందికి సోకినట్టు గుర్తించారు. అయితే, జూన్‌ నుంచి ఇప్పటివరకు 214 మందికి వైరస్‌ సోకినప్పటికీ నిర్లక్ష్యం చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. 

మరోవైపు, వైరస్‌ మ్యుటేషన్‌ చెందడంతో ఇప్పటికే కీలక దశలో ఉన్న కొవిడ్‌ టీకాలకు ముప్పుగా మారే అవకాశం ఉందన్న హెచ్చరికలతో డెన్మార్క్‌ కీలక ఆదేశాలు జారీచేసింది. ఆ దేశంలోని పలు ఫాం‌లలో పెంచుతున్న దాదాపు 15 నుంచి 17 మిలియన్ల మింక్‌లను వధించాలని ఆదేశించింది.  అలాగే, డెన్మార్క్‌లో మింక్‌ ఫాం‌లలో కేసులు బయటపడటంతో ఆ దేశం నుంచి ప్రవేశాలపై బ్రిటన్‌ నిషేధం విధించింది. వైరస్‌ మ్యుటేషన్‌ చెందడం సాధారణమేనని, అంత ప్రమాదకరమేమీ కాదని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. మనుషుల్లో ఇది అంత తీవ్రమైన అనారోగ్యానికి కారణం కాదని చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని