యాంటీబాడీలను గుర్తించే సరికొత్త కిట్‌!

సీపాస్‌(cPass) పేరుతో పిలిచే ఈ కిట్‌కు తాజాగా అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ(ఎఫ్‌డీఏ) అనుమతి కూడా లభించింది.

Published : 10 Nov 2020 01:51 IST

రూపొందించిన సింగపూర్‌ పరిశోధకులు

సింగపూర్‌: కరోనా వైరస్‌ నిర్ధారణతోపాటు యాంటీబాడీలను వేగంగా గుర్తిచేందుకు ప్రపంచవ్యాప్తంగా ముమ్మర పరిశోధనలు జరుగుతన్న విషయం తెలిసిందే. ఇలా కరోనా వైరస్‌ను ఎదుర్కొనే యాంటీబాడీలను తెలుసుకోవడంతోపాటు వైరస్‌ను తటస్థీకరించే సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు సింగపూర్‌ పరిశోధకులు ఓ ప్రత్యేక కిట్‌ను రూపొందించారు. సీపాస్‌ (cPass) పేరుతో పిలిచే ఈ కిట్‌కు తాజాగా అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్‌డీఏ) అనుమతి కూడా లభించింది. ఈ విషయాన్ని ఎఫ్‌డీఏ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. కరోనా వైరస్‌ను తటస్థీకరించే సామర్థ్యాన్ని అంచనా వేయగలిగే తొలి కిట్‌ కూడా ఇదే కావడం విశేషం.

సెరోలజీ యాంటీబాడీ టెస్ట్‌ ద్వారా ఇదివరకే తమకు వైరస్‌ సోకిందా? లేదా? అనే విషయాన్ని తెలుసుకునే వీలుంటుంది. ఇలా ఇప్పటికే అత్యవసర వినియోగం కింద 50కిపైగా సెరోలజీ టెస్టులకు ఎఫ్‌డీఏ అనుమతి ఇచ్చింది. అయితే, అవి కేవలం ఇది వరకు నిరోధించిన యాంటీబాడీల ఉనికిని మాత్రమే గుర్తిస్తాయి. యాంటీబాడీలు వైరస్‌ వ్యాప్తిని ఎంతవరకు అడ్డుకుంటాయని మాత్రం కచ్చితంగా అంచనా వేయలేవు. కానీ, తాజాగా రూపొందించిన ఈ కిట్‌ ద్వారా యాంటీబాడీలు వైరస్‌ను తటస్థీకరించే సామర్థ్యాన్ని కూడా అంచనా వేయగలుగుతాయని ఎఫ్‌డీఏ పేర్కొంది. అంతేకాకుండా వ్యాక్సిన్లు పనిచేస్తాయో? లేదో? తెలుసుకోవడం, జనాభాలో ఎంతమందికి వైరస్‌ పోకిందనే విషయాన్ని కనుక్కోవడంతోపాటు కాంటాక్ట్‌ ట్రేసింగ్‌లో ఈ కిట్‌ ఎంతగానో దోహదపడుతుందని దీన్ని అభివృద్ధి చేసిన సింగపూర్‌ శాస్త్రవేత్తలు స్పష్టంచేస్తున్నారు. వీటి ఫలితం కూడా కేవలం గంటలోనే వస్తుందని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని