Taliban: అధికారంలోకి వచ్చినా అజ్ఞాతమేనా?

అఫ్గానిస్థాన్‌ను గుప్పిటపట్టిన తాలిబన్లు రేపోమాపో లాంఛనంగా అధికార పగ్గాలు చేపట్టబోతున్నారు.

Published : 31 Aug 2021 09:09 IST

ఎన్నడూ బయటకు రాని తాలిబన్‌ అధినాయకుడు 
అమెరికా దాడుల భయం వీడని హైబతుల్లా 

కాబుల్‌: అఫ్గానిస్థాన్‌ను గుప్పిటపట్టిన తాలిబన్లు రేపో మాపో లాంఛనంగా అధికార పగ్గాలు చేపట్టబోతున్నారు. ఈ పరిస్థితుల్లోనూ తాలిబన్‌ అధినాయకుడు హైబతుల్లా అఖుండ్‌ జాదా అజ్ఞాతం నుంచి బయటకు రావడంలేదు. ఇంతకుముందు కూడా ఆ నేత ఎన్నడూ ఎవరికీ కనిపించేవాడు కాదు. తాలిబన్లు ఇటీవల ఛాయాచిత్రం విడుదల చేసేవరకు అతని రూపురేఖలు కూడా బయటి ప్రపంచానికి తెలియవు. అఫ్గాన్‌ ప్రభుత్వం పతనమైన వెంటనే తాలిబన్‌ నాయకులు, సాయుధ మదర్సా విద్యార్థులు, రాటుదేలిన కమాండోలు విజయగర్వంతో కాబుల్‌ వీధుల్లో వీరంగం తొక్కారు. సాధారణంగా ఇలాంటి విజయోత్సవాలకు అధినాయకుడు నాయకత్వం వహిస్తుంటాడు. ఈసారి అలా జరగలేదు. అఖుండ్‌ జాదా మొదటి నుంచీ కాందహార్‌లోనే మకాం ఉంటున్నాడనీ, త్వరలోనే ప్రజల్లోకి వస్తాడని తాలిబన్‌ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. అఖుండ్‌ మొదటినుంచీ మతపరమైన కార్యకలాపాల్లో నిమగ్నమవుతూ అజ్ఞాతంలోనే ఉంటున్నాడు. 

అంతర్గత కుమ్ములాటలతో చేజిక్కిన అవకాశం 

తాలిబన్‌ సంస్థాపకుడు ముల్లా మహమ్మద్‌ ఒమర్‌ అకాల మరణం చెందిన విషయం 2015లో బయటకు వచ్చింది. ఆ స్థానాన్ని ముల్లా మన్సూర్‌ అఖ్తర్‌ భర్తీ చేశాడు. 2016లో అఖ్తర్‌ను డ్రోన్‌ దాడి ద్వారా అమెరికా అంతమొందించాక, నాయకత్వం కోసం తాలిబన్‌ వర్గాల మధ్య కుమ్ములాట చోటు చేసుకుంది. సమైక్యంగా నడపగల నాయకుడి కోసం మొదలైన అన్వేషణ అఖుండ్‌ జాదా ఎంపికతో ముగిసింది. అంతవరకు అమెరికా బారి నుంచి తప్పించుకోవడానికి ఆ నాయకుడు రహస్య జీవితం గడిపేవాడు. మతపరమైన సందేశాలు వెలువరించడం మినహా జనంలోకి వచ్చిందే లేదు. ముల్లా ఒమర్‌ శైలి కూడా ఇలాగే ఉండేది. కాందహార్‌లోనే ఉంటూ తాలిబన్‌ ప్రభుత్వానికి దిశానిర్దేశం చేసే ఒమర్‌ మాటే శాసనంగా చలామణి అయ్యేది. అఖుండ్‌ జాదా కూడా గుట్టుగా చక్రం తిప్పుతున్నాడు. ఇప్పుడు తాలిబన్లు తిరిగి సింహాసనం చేజిక్కించుకున్నారు కనుక, బహుశా ఒకసారి బయటి ప్రపంచానికి కనిపించి, మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయి, అక్కడ నుంచే పరోక్ష పాలన సాగించే అవకాశం ఉందని నిపుణుల అంచనా. 

అవన్నీ వదంతులే 

జాదాకు కరోనా సోకిందనీ, ఆరోగ్యం బాగాలేదనీ గతంలో వదంతులు వ్యాపించాయి. కొందరైతే బాంబు పేలుడులో ఆ నాయకుడు మరణించినట్లు ప్రచారం చేశారు. అవేవీ నిజం కావని తేలిపోయింది. అధికారం చేజిక్కిన తరవాత అఫ్గాన్‌లో వివిధ తెగలు, వర్గాలు కలహించుకునే ప్రమాదం ఉంది. వీరందరినీ సమన్వయపరచడానికి అఖుండ్‌ జాదా జనం ముందుకు రాక తప్పకపోవచ్చని భావిస్తున్నారు. అమెరికా సేనలు పూర్తిగా నిష్క్రమించిన తర్వాతే ఇది జరగవచ్చని అంచనా. జాదా తెరవెనుక సూత్రధారిగానే కొనసాగుతూ, తాలిబన్‌ ఉప నాయకుడు అబ్దుల్‌ ఘనీ బరాదర్‌కు దేశ పాలన పగ్గాలు అప్పగించే అవకాశముంది. కాబూల్‌ తాలిబన్ల వశం కావడంతో ఇంకా అనేకమంది నాయకులు తెరమీదకు రానున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని