రైతుల ఆందోళన: విధుల్లోని పోలీసులకు కరోనా

దేశ రాజధాని సరిహద్దులో రైతుల ఆందోళన వద్ద విధులు నిర్వహిస్తున్న  ఇద్దరు పోలీసు ఉన్నతాధికారులకు కరోనా సోకడం తాజాగా కలకలం రేపింది. దిల్లీ-హరియాణా మార్గంలోని సింఘు సరిహద్దు వద్ద పోలీసు బలగాలకు

Updated : 11 Dec 2020 13:19 IST

16వ రోజుకు చేరిన అన్నదాతల నిరసన

దిల్లీ: దేశ రాజధాని సరిహద్దులో రైతుల ఆందోళన వద్ద విధులు నిర్వహిస్తున్న  ఇద్దరు పోలీసు ఉన్నతాధికారులకు కరోనా సోకడం తాజాగా కలకలం రేపింది. దిల్లీ-హరియాణా మార్గంలోని సింఘు సరిహద్దు వద్ద పోలీసు బలగాలకు నేతృత్వం వహిస్తున్న డీసీపీ, అదనపు డీసీపీకి కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు దిల్లీ పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం వారిద్దరూ హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపారు. నిరసన చేస్తున్న రైతులు కొవిడ్‌ నిబంధనలు పాటించకపోవడం, చలి తీవ్రత ఎక్కువగా ఉన్నందున వైరస్‌ వేగంగా వ్యాపించే ముప్పు ఉందని ఇప్పటికే పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో తాజా కేసులు కలవరపెడుతున్నాయి. 

మరోవైపు నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా హస్తిన శివారుల్లో అన్నదాతలు చేస్తున్న ఆందోళన 16వ రోజుకు చేరింది. తీవ్రమైన చలిని కూడా లెక్కచేయకుండా సింఘు, టిక్రీ సరిహద్దుల్లో వేలాది మంది రైతులు బైఠాయించి తమ నిరసన సాగిస్తున్నారు. దీంతో సరిహద్దుల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసుల పహారా కూడా కొనసాగుతోంది. కాగా.. ఆందోళన చేస్తున్న రైతులకు కొన్ని ఎన్జీవోలు కొవిడ్‌ పరీక్షలు, ఇతర వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నాయి. 

వ్యవసాయ చట్టాల రద్దుపై గత రెండు వారాలుగా రైతులు ఆందోళన చేస్తున్నా.. సమస్య ఇంకా పరిష్కారం కాలేదు. అటు ప్రభుత్వం.. ఇటు రైతులు పట్టువీడకపోవడంతో ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో గురువారం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ మీడియాతో మాట్లాడుతూ.. రైతులతో చర్చలకు తాము సిద్ధమేనని తెలిపారు. ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలు పరిశీలించాలని కోరారు. దీనికి రైతు నాయకులు స్పందిస్తూ.. కేంద్రం మరోసారి చర్చలకు ఆహ్వానిస్తే అప్పుడు నిర్ణయం తీసుకుంటామన్నారు. అయితే చట్టాలను రద్దు చేయకపోతే మాత్రం ఉద్యమాన్ని మరింత తీవ్రం చేస్తామని.. రైలుపట్టాలపై ఆందోళన చేపట్టే తేదీలను త్వరలోనే వెల్లడిస్తామన్నారు. ఈ నెల 14 నుంచి దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాలని రైతు సంఘాలు నిర్ణయించిన విషయం తెలిసిందే. 

ఇదీ చదవండి..

పీటముడి వీడేదెలా?


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని