అరిజోనాలో ట్రంప్‌ వర్గం ఆందోళన..!

‘ఫేక్‌ మీడియా’.. ఇది ట్రంప్‌ నోట దాదాపు ప్రతి  ప్రెస్‌మీట్‌లో వినిపించే మాట. ఆయన అమెరికాలో ఫాక్స్‌న్యూస్‌, న్యూయార్క్‌ పోస్టులను తప్పితే మిగిలిన ప్రధాన మీడియా సంస్థలకు వ్యతిరేకంగా ఉంటారు. కానీ, ఈ సారి అధ్యక్ష ఎన్నికల ఫలితాల ప్రకటనలో ‘ఫాక్స్‌న్యూస్‌’ ట్రంప్‌ అభిమానులకు

Updated : 06 Nov 2020 13:04 IST

 ఫలితం విషయంలో గందరగోళం దేనికి..?

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘ఫేక్‌ మీడియా’.. ఇది ట్రంప్‌ నోట దాదాపు ప్రతి  ప్రెస్‌మీట్‌లో వినిపించే మాట. ఆయన అమెరికాలో ఫాక్స్‌న్యూస్‌, న్యూయార్క్‌ పోస్టులను తప్పితే మిగిలిన ప్రధాన మీడియా సంస్థలకు వ్యతిరేకంగా ఉంటారు. కానీ, ఈ సారి అధ్యక్ష ఎన్నికల ఫలితాల ప్రకటనలో ‘ఫాక్స్‌న్యూస్‌’ ట్రంప్‌ అభిమానులకు కోపం తెప్పించింది. వారంతా నిన్నరాత్రి అరిజోనాలోని ఫోనిక్స్‌ కౌంటింగ్‌ సెంటర్‌ వద్దకు చేరి ఫాక్స్‌ న్యూస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అరిజోనా బైడెన్‌కు దక్కినట్లు ప్రకటించడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ, ఫాక్స్‌ న్యూస్‌ మాత్రం తన నిర్ణయానికి కట్టుబడి ఉంది. దీంతో ఆ వార్తాసంస్థపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి.     
అమెరికా ఎన్నికల ఫలితాలను ప్రకటించే క్రమంలో దాదాపు 11 ఎలక్టోరల్‌ ఓట్ల విషయంలో గందరగోళం చెలరేగింది. అమెరికాకు చెందిన వేర్వేరు ఛానల్స్‌ వేర్వేరు ఆధిక్యాలను చూపిస్తున్నాయి. అక్కడ అధికారం అందించే మేజిక్‌ ఫిగర్‌ 270. ఇప్పటికే అసోసియేటెడ్‌ ప్రెస్‌, ఫాక్స్‌  న్యూస్‌ వంటి ఛానల్స్‌ బైడెన్‌ 264 ఓట్లను సాధించినట్లు చూపిస్తున్నాయి. కానీ, న్యూయార్క్‌ టైమ్స్‌, సీఎన్‌ఎన్‌, వాషింగ్టన్‌ పోస్టు వంటి మీడియా సంస్థలు  మాత్రం 253 మాత్రమే చూపిస్తున్నాయి. దీనికో కారణం ఉంది. అమెరికన్‌ మీడియా సంస్థల్లో ‘డెసిషన్‌ డెస్క్‌’ అని ఒక వ్యవస్థ ఉంది. వారు కౌంటింగ్‌ ట్రెండ్‌, గణాంకాల తీరును పరిశీలించి.. విజయానికి తగిన అవకాశాలు ఉన్నచోట్ల తమ అంచనాలను ప్రకటిస్తారు. ఆయా మీడియా సంస్థలు వాటి అంచనాలను అనుసరిస్తుంటాయి. అలానే అసోసియేటెడ్‌ ప్రెస్‌ సంస్థ ఈ సారి అరిజోనా బైడెన్‌కు అనుకూలంగా ఉన్నట్లు పేర్కొంది. దీంతో దానిని అనుసరించే సంస్థలు 264గా పేర్కొంటున్నాయి. ఫాక్స్‌ న్యూస్‌ డెసిషన్‌ డెస్క్‌ కూడా బైడెన్‌కు 264 ఓట్లు వచ్చినట్లు ప్రకటించింది. ఇది ట్రంప్‌ వర్గం ఆగ్రహానికి కారణం అయింది. ఈ డెస్క్‌లోని ఆర్నోన్‌ మిష్కిన్‌ అనే డెమొక్రాటిక్‌ మద్దతుదారు కారణంగానే ఇలా జరిగిందని ట్రంప్‌ మద్దతుదారులు ఆరోపిస్తున్నారు. కానీ, ఫాక్స్‌ న్యూస్‌ తన నిర్ణయం నుంచి వెనక్కి తగ్గలేదు. 

ఎన్నికల రోజు వరకు వచ్చిన అన్ని ఓట్లను లెక్కిస్తామని అరిజోనా గవర్నర్‌ డగ్‌డ్యూసి తెలిపారు. పెన్సిల్వేనియా, జార్జియాలో కౌంటింగ్‌ ఆపమని కోరుతున్న ట్రంప్‌ వర్గం.. అరిజోనాలో మాత్రం కొనసాగించాలని కోరడం గమనార్హం. ఇక్కడ ఇప్పటి వరకు 90శాతం ఓట్లు లెక్కించగా.. బైడెన్‌కు 50.1శాతం, ట్రంప్‌నకు 48.5శాతం లభించాయి. 

 

ట్రంప్‌ అనుకున్నదంతా అవుతోంది..!

అమెరికా 2020: 120ఏళ్లలోనే అత్యధిక ఓటింగ్‌

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని