Richest Ganesh: 66 కిలోల బంగారంతో అలంకరణ.. మండపానికి రూ.360.40 కోట్లకు బీమా!

ముంబయిలోని ఓ గణేశ్‌ మండపానికి ఏకంగా రూ.360.40 కోట్లకు బీమా చేయించడం గమనార్హం. ఇక్కడి వినాయకుడి విగ్రహాన్ని 66.5 కిలోల బంగారు ఆభరణాలతో అలంకరించినట్లు నిర్వాహకులు తెలిపారు.

Published : 18 Sep 2023 20:02 IST

ముంబయి: దేశవ్యాప్తంగా వినాయక ఉత్సవాలు (Ganesh Festival) అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. కొన్నిచోట్ల ఖరీదైన గణేశ్‌ విగ్రహాలు ఏర్పాటు చేయగా.. మరికొన్ని చోట్ల భారీ సెట్టింగ్‌లతో తాత్కాలిక మండపాలను నిర్మించారు. ఈ క్రమంలోనే ముంబయిలోని ప్రముఖ జీఎస్‌బీ సేవా మండల్‌ (GSB Seva Mandal) ‘మహాగణపతి’ ఈ ఏడాదీ వార్తల్లో నిలిచింది. ఇక్కడి విఘ్నేశ్వరుడి విగ్రహాన్ని ఏకంగా 66.5 కిలోల బంగారు, 295 కిలోలకు పైగా వెండి ఆభరణాలు, ఇతరత్రా విలువైన వస్తువులతో అలంకరించడం గమనార్హం. పైగా మండపానికి రికార్డు స్థాయిలో రూ.360.40 కోట్లకు బీమా చేయించినట్లు జీఎస్‌బీ సేవామండల్‌ నిర్వాహకులు ఓ వార్తాసంస్థకు తెలిపారు.

సెలబ్రిటీ గణేశా.. ఆకట్టుకుంటున్న విభిన్న ఆకృతులు

ఈ ఏడాది 69వ వార్షికోత్సవం నిర్వహిస్తున్నామని, ఈ క్రమంలోనే మండపం వద్ద భద్రతా ఏర్పాట్లలో భాగంగా మొదటిసారి ఫేషియల్‌ రికగ్నిషన్‌ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు చెప్పారు. ఈ ఏడాది రూ.360.40 కోట్లకు బీమా తీసుకున్నట్లు చెప్పారు. భక్తులు, నిర్వాహకులకు ఇది వర్తిస్తుంది. భక్తుల సౌలభ్యం కోసం క్యూఆర్‌ కోడ్, డిజిటల్ లైవ్ సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం, వచ్చే ఏడాది ప్రారంభోత్సవం పురస్కరించుకుని హోమం, ఇతరత్రా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. గతేడాది సైతం ఈ గణేశ్‌ మండపానికి రూ.316 కోట్లకు ఇన్సూరెన్స్‌ చేయించిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు