Amit Shah: మణిపుర్‌ కల్లోలం.. అమిత్‌ షా వార్నింగ్ ఎఫెక్ట్‌ కనిపిస్తోందా..?

Manipur Violence: మణిపుర్‌(Manipur)లో కేంద్రమంత్రి అమిత్‌ షా ఇచ్చిన వార్నింగ్ పనిచేస్తున్నట్లు కనిపిస్తోంది. ఘర్షణల్లో భాగంగా లూఠీ అయిన ఆయుధాలు వెనక్కి వస్తుండటమే అందుకు కారణం. 

Published : 02 Jun 2023 19:42 IST

ఇంఫాల్‌: ఇటీవల ఘర్షణల్లో అట్టుడికిన మణిపుర్‌(Manipur)లో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా(Union Home Minister Amit shah) పర్యటన ప్రభావం కనిపిస్తోంది. ఆయన నిన్న శాంతి ప్రణాళిక ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తితో కమిటీ వేస్తామని చెప్పారు. ఈ క్రమంలో మణిపుర్‌లోని కొన్ని ప్రాంతాల్లో కర్ఫ్యూను తొలగించగా, మరికొన్ని ప్రాంతాల్లో సడలించారు. (Manipur Violence)

ఇదిలా ఉంటే.. ఘర్షణలు చెలరేగిన సమయంలో పోలీసు స్టేషన్ల నుంచి సుమారు రెండువేల ఆయుధాల లూఠీ జరిగింది. ఈ క్రమంలో ఆయుధాలు కలిగిన వ్యక్తులు వెంటనే వాటిని అప్పగించాలని నిన్న అమిత్‌ షా వార్నింగ్ ఇచ్చారు. దాంతో 140 ఆయుధాలు వెనక్కి వచ్చినట్లు రాష్ట్ర పోలీసు విభాగం వెల్లడించింది. వాటిలో ఏకే-47, ఇన్సాస్ రైఫిళ్లు,స్టెన్‌ గన్స్, గ్రనేడ్‌ లాంచర్, పిస్తోళ్లు ఉన్నాయి. ఈ ఆయుధాలను గుర్తించేందుకు శుక్రవారం నుంచి కూంబింగ్ ఆపరేషన్‌ జరుగుతోంది. దీనిపై నిన్న షా ప్రకటన చేశారు. ఆ సమయంలో ఎవరివద్ద అయినా వాటిని గుర్తిస్తే కఠిన చర్యలు తప్పవని మంత్రి గట్టి వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే.  

మణిపుర్‌(Manipur) గత కొన్ని రోజులుగా హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. ఎస్టీ హోదా కోసం మెయిటీలు చేసిన డిమాండ్‌కు మణిపుర్‌ వ్యాలీ ప్రాంతానికి చెందిన చట్టసభ్యుల నుంచి మద్దతు లభించింది. దీంతో గిరిజన ప్రాంత ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇది ఘర్షణకు దారితీసింది. మణిపుర్ జనాభాలో 53 శాతం మంది మెయిటీ వర్గానికి చెందినవారే. మణిపుర్ వ్యాలీలో వారి ప్రాబల్యం ఎక్కువ. బంగ్లాదేశ్‌, మయన్మార్‌ నుంచి వస్తోన్న అక్రమ వలసదారులతో తాము సమస్యలు ఎదుర్కొంటున్నామని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎస్టీ హోదా విషయంలో మెయిటీలు, గిరిజనులకు మధ్య జరిగిన ఘర్షణల్లో 98 మంది మరణించినట్లు, 300 మంది గాయపడినట్లు గణాంకాలను బట్టి తెలుస్తోంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని