Air India: మూత్రవిసర్జన ఘటన.. సిబ్బందికి ఎయిరిండియా సీఈఓ వార్నింగ్‌..!

విమానాల్లో ప్రయాణికులు అనుచితంగా ప్రవర్తిస్తే.. ఆ ఘటనలను తప్పనిసరిగా అధికారులకు ఫిర్యాదు చేయాలని ఎయిరిండియా సీఈఓ తమ సంస్థ సిబ్బందిని ఆదేశించారు. ఇటీవల ఎయిరిండియా విమానంలో మహిళపై ప్రయాణికుడు మూత్ర విసర్జన చేసిన ఘటన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.

Published : 06 Jan 2023 12:21 IST

దిల్లీ: విమానంలో ఓ మహిళపై పురుష ప్రయాణికుడు మద్యం మత్తులో మూత్ర విసర్జన చేసిన ఘటన నేపథ్యంలో ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియా (Air India) సంస్థ క్రమశిక్షణ చర్యలు చేపట్టింది. విమానాల్లో ఇలాంటి ఘటనలు జరిగితే సిబ్బంది తప్పనిసరిగా అధికారులకు ఫిర్యాదు చేయాలని సంస్థ సీఈఓ క్యాంబెల్‌ విల్సన్‌ (Campbell Wilson) గట్టి వార్నింగ్ ఇచ్చారు.

ఈ ఘటనలో ఎయిరిండియా (Air India) సిబ్బంది తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తోన్న నేపథ్యంలో.. సంస్థ సీఈఓ విల్సన్‌ ఉద్యోగులకు ఇంటర్నల్‌ ఈమెయిల్ పంపించారు. అందులో మూత్ర విసర్జన ఘటననూ ప్రస్తావించారు. ‘‘బాధిత ప్రయాణికురాలు అనుభవించిన వేదనను అర్థం చేసుకోగలం. ఈ ఘటన నుంచి మనం కచ్చితంగా కొన్ని పాఠాలు నేర్చుకోవాలి. అందులో అత్యంత ముఖ్యమైనది.. మన విమానాల్లో ప్రయాణికులెవరైనా అనుచిత ప్రవర్తనకు పాల్పడితే.. ఆ విషయాన్ని మనం వీలైనంత త్వరగా అధికారులకు నివేదించాలి. అలాంటి ఘటనల్లో ఇరు పక్షాలు రాజీ కుదుర్చుకున్నాయని మనకు తెలిసినప్పటికీ.. తప్పనిసరిగా ఫిర్యాదు చేయాలి. విమానాల్లో ప్రయాణికుల ప్రవర్తనా నియమావళిపై సిబ్బందికి స్పష్టమైన అవగాహన ఉండాలి. ఆ నిబంధనలు ఉల్లంఘించే ప్రయాణికులపై సమయానుకూలంగా కఠినమైన నిర్ణయం తీసుకోవాలి’’ అని సీఈఓ సిబ్బందిని సూచించారు.

నవంబరు 26న న్యూయార్క్‌ నుంచి దిల్లీకి వస్తున్న విమానం బిజినెస్‌ తరగతిలో ఓ మహిళపై ప్రయాణికుడు మూత్ర విసర్జన చేసిన ఘటన తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. బాధిత మహిళ టాటా గ్రూప్‌ ఛైర్మన్‌ నటరాజన్‌ చంద్రశేఖరన్‌కు లేఖ రాయడంతో విషయం బహిర్గతమైంది. సదరు ప్రయాణికుడి గురించి తాను ఫిర్యాదు చేసినా అతడిపై విమాన సిబ్బంది ఎలాంటి చర్యలూ తీసుకోలేదని, దీంతో విమానం దిగగానే అతడు దర్జాగా వెళ్లిపోయాడని లేఖలో ఆమె ఆరోపించారు. దీంతో ఎయిరిండియా (Air India)పై విమర్శలు వెల్లువెత్తాయి.

అయితే, ఈ ఘటనలో ఇరు పక్షాలు రాజీకి వచ్చినందునే తాము పోలీసులకు ఫిర్యాదు చేయలేదని డీజీసీఏకు ఇచ్చిన నివేదికలో ఎయిరిండియా (Air India) వెల్లడించింది. తొలుత చర్య తీసుకోవాలని కోరిన ప్రయాణికురాలు.. ఆ తర్వాత వద్దనడంతో ఇద్దరూ రాజీ పడినట్లు భావించామని తెలిపింది. కాగా.. ఈ సమాధానంపై డీజీసీఏ అసంతృప్తి వ్యక్తం చేసింది. సంస్థ తీరు వృత్తి ప్రమాణాలను ఉల్లంఘించేదిగా ఉందని తప్పు పట్టింది. విధుల్లో నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై ఎందుకు చర్య తీసుకోలేదో వివరించాలంటూ సంస్థ అధికారులకు, సంఘటన జరిగిన రోజు విమాన విధుల్లో ఉన్న సిబ్బందికి డీజీసీఏ షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని