Supreme Court: ‘ఎయిర్‌ ఇండియా’ ఘటన.. కేంద్రం, డీజీసీఏలకు నోటీసులు!

ఎయిర్‌ ఇండియా విమానంలో తోటి ప్రయాణికురాలిపై ఓ వ్యక్తి మూత్రవిసర్జన చేసిన ఘటన చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. అయితే, ఈ తరహా ఘటనల్లో వ్యవహరించాల్సిన తీరుపై మార్గదర్శకాల రూపకల్పనకు దిశానిర్దేశం చేయాలని కోరుతూ సదరు ప్రయాణికురాలు దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారణకు సుప్రీం కోర్టు అంగీకరించింది.

Published : 08 May 2023 23:43 IST

దిల్లీ: ఎయిర్‌ ఇండియా (Air India) విమానంలో తోటి ప్రయాణికురాలిపై ఓ వ్యక్తి మూత్రవిసర్జన చేసిన ఘటన తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ తరహా ఘటనలను నివారించడంతోపాటు వాటి విషయంలో వ్యవహరించాల్సిన తీరుపై మార్గదర్శకాల (SOPs) రూపకల్పనకు దిశానిర్దేశం చేయాలని కోరుతూ ఆ ప్రయాణికురాలు దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారణకు సుప్రీం కోర్టు (Supreme Court) అంగీకరించింది. ఈ క్రమంలోనే కేంద్రం, డీజీసీఏ (DGCA)లతోపాటు అన్ని విమానయాన సంస్థల (Airliners)కు నోటీసులు జారీ చేసింది. వేసవి సెలవుల తర్వాత జులైలో వ్యాజ్యంపై విచారణ చేపడతామని తెలిపింది.

ఘటనానంతరం తన విషయంలో ఎయిర్ ఇండియా, డీజీసీఏలు సరైన రీతిలో వ్యవహరించలేదని ఆరోపిస్తూ.. మార్చిలో ఆమె సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. 2014- 23 వరకు విమాన ప్రయాణికుల అనుచిత ప్రవర్తనలకు సంబంధించిన ఏడు ఘటనలనూ ప్రస్తావించారు. సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ పీఎస్‌ నరసింహ, జస్టిస్‌ జేబీ పార్దీవాలాలతో కూడిన ధర్మాసనం సోమవారం ఈ వ్యాజ్యాన్ని పరిశీలించింది. ఈ కేసులో 72 ఏళ్ల వృద్ధురాలు ఇబ్బంది పడ్డారని సీజేఐ పేర్కొన్నారు. ఈ క్రమంలోనే కేంద్రం, డీజీసీఏలతోపాటు ఎయిర్‌ ఇండియా, విస్తారా, ఇండిగో, గో ఎయిర్‌లైన్స్‌(ఇండియా) లిమిటెడ్‌, ఆకాశ ఎయిర్‌, స్పైస్‌జెట్‌ లిమిటెడ్‌లకు నోటీసులు జారీ చేశారు.

ఇదిలా ఉండగా.. గతేడాది నవంబరులో న్యూయార్క్‌ నుంచి దిల్లీ వస్తున్న ఎయిర్‌ ఇండియా విమానంలో తోటి ప్రయాణికురాలిపై శంకర్‌ మిశ్రా అనే వ్యక్తి మద్యం మత్తులో మూత్ర విసర్జన చేసినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. మిశ్రాను పోలీసులు జనవరి 6న బెంగళూరులో అరెస్టు చేశారు. తదనంతరం దిల్లీ కోర్టు అతనికి షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని