MCD polls: భాజపాకు అంతకుమించి సీట్లు రావు.. దిల్లీ ప్రజలకు కేజ్రీవాల్‌ 10 కీలక హామీలివే..

దేశ రాజధాని నగరం దిల్లీలో మున్సి‘పోల్స్‌’ (MCD elections)వేడి రాజుకుంది. డిసెంబర్‌ 4న ఎన్నికలు జరగనుండటంతో ఆప్‌(AAP), భాజపా(BJP) మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.

Published : 12 Nov 2022 01:58 IST

దిల్లీ: దేశ రాజధాని నగరం దిల్లీలో మున్సి‘పోల్స్‌’ (MCD elections)వేడి రాజుకుంది. డిసెంబర్‌ 4న ఎన్నికలు జరగనుండటంతో ఆప్‌(AAP), భాజపా(BJP) మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మొత్తం 250 వార్డులకు జరిగే ఈ ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకొనేందుకు భాజపా, ఆప్‌, కాంగ్రెస్‌ ప్రచారం ముమ్మరం చేశాయి. ఇందులో భాగంగా శుక్రవారం ఆప్‌ జాతీయ కన్వీనర్‌, దిల్లీ సీఎం అర్వింద్‌ కేజ్రీవాల్‌ హస్తిన వాసులకు కీలక హామీలు ఇచ్చారు. ఆప్‌ ఏం చెబుతుందో.. అదే అమలు చేస్తుందన్న కేజ్రీవాల్‌.. పురపాలక కార్పొరేషన్‌లో అవినీతిని అంతం చేయడంతో పాటు స్వచ్ఛ దిల్లీగా మారుస్తామని వాగ్దానం చేశారు. వాళ్లు మాత్రం ఇప్పుడు ఇచ్చిన హామీలను, మేనిఫెస్టోలను ఎన్నికల తర్వాత బుట్టదాఖలు చేస్తారంటూ భాజపాపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. దిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌కు నిధులు మంజూరు చేయడంలేదని తనను నిందిస్తున్నారని.. రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వలేదని కేంద్ర ప్రభుత్వం ఆరోపణలు చేయడం చరిత్రలో ఇదే తొలిసారన్నారు. దిల్లీని చెత్త రహిత ప్రాంతంగా మార్చేందుకు కేంద్రం నిధులు తెస్తామని గతంలో హామీ ఇచ్చిన భాజపా గత 15 ఏళ్లలో చేసిందేమీ లేదని విరుచుకుపడ్డారు. ఈ ఎన్నికల్లో ఆ పార్టీకి 20కి మించి సీట్లు రావన్నారు. ఈ ఎన్నికల్లో ఆప్‌ను గెలిపించాలని కోరుతూ కేజ్రీవాల్‌ చేసిన 10 వాగ్దానాలు ఇవే.. 

  1. దిల్లీ నగరాన్ని సుందరీకరిస్తాం. నగరంలో పేరుకుపోయిన చెత్తాచెదారం, అపరిశుభ్రత, కాలువల్ని చూస్తుంటే బాధగా ఉంది. ఢిల్లీలో కొత్త చెత్త డంప్‌లు ఉండవు. చెత్తను ఎప్పటికప్పుడు పారేయడం రాకెట్‌ సైన్స్‌ ఏమీ కాదు. 
  2. దిల్లీలోని రోడ్లు, వీధుల్ని శుభ్రపరుస్తాం.
  3. దిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో ఉన్న అన్ని పాఠశాలలు, ఆస్పత్రులను పరిశుభ్రంగా ఉంచుతాం.
  4. పార్కింగ్ సమస్యకు శాశ్వత పరిష్కారం
  5. దిల్లీలో వీధికుక్కలు, కోతులు, ఆవుల బెడద నుంచి ప్రజలకు విముక్తి కల్పిస్తాం. 
  6. పురపాలక పాఠశాలలు, ఆస్పత్రుల్లో వసతులు మెరుగుపరుస్తాం.
  7. పార్కులను సుందరీకరించి.. నగరాన్ని పార్కుల నగరంగా మారుస్తాం
  8. తాత్కాలిక ఉద్యోగాలను క్రమబద్ధీకరిస్తాం. వేతనాలను సకాలంలో చెల్లిస్తాం.
  9. వర్తకులకు ఆన్‌లైన్‌లోనే లైసెన్సులు మంజూరు చేస్తాం. ఇన్‌స్పెక్టర్‌ రాజ్‌కు చరమగీతం పాడతాం
  10. వీధి వ్యాపారుల కోసం పరిశుభ్రమైన వాణిజ్య జోన్‌లను ఏర్పాటు చేస్తాం.

దిల్లీలో ఈసారి 250 వార్డులకు డిసెంబర్‌ 4న ఎన్నికలు జరగనున్నాయి. 7న ఫలితాలు వెల్లడి కానున్నాయి. 2007 నుంచి దిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో భాజపానే విజయం సాధిస్తూ వస్తోంది. 2017లో జరిగిన పురపాలక ఎన్నికల్లో  భాజపా 181 సీట్లు గెలుచుకోగా.. తొలిసారి అప్పుడే బరిలోకి దిగిన ఆప్‌ 49 స్థానాలు, కాంగ్రెస్‌ 31 సీట్లు గెలుచుకున్నాయి. దిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో మొత్తం 272 వార్డులు ఉండగా.. ఈ ఏడాది మొదట్లో వాటి సంఖ్యను 250కి తగ్గించిన విషయం తెలిసిందే.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని