Road Safety Awareness: రహదారి భద్రత.. అస్సాం మంత్రి వినూత్న ప్రచారం

రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ‘పథ్‌ సురక్ష జన్‌ ఆందోళన్‌’ పేరిట అస్సాం మంత్రి పరిమాళ్‌ శుక్లబైద్య బైక్‌ ర్యాలీ చేపట్టారు.

Published : 20 Nov 2023 18:28 IST

గువాహటి: రహదారి భద్రతపై అవగాహన (Road Safety Awareness) కల్పించేందుకు అస్సాం రవాణాశాఖ మంత్రి  పరిమాళ్‌ శుక్లబైద్య (Parimal Suklabaidya) వినూత్న కార్యక్రమం చేపట్టారు. ‘ పథ్‌ సురక్ష జన్‌ ఆందోళన్‌’ పేరిట  రాష్ట్ర వ్యాప్తంగా బైక్‌ ర్యాలీ చేస్తున్నారు. ప్రపంచ రోడ్డు బాధితుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన.. తాజాగా రెండో రోజు ర్యాలీకి సంబంధించిన వీడియోలను ఎక్స్‌ (ట్విటర్‌)లో పోస్టు చేశారు. ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ప్రోత్సాహంతోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ప్రస్తుతం గువాహటిలో ర్యాలీ కొనసాగుతోందని, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ ఈ కార్యక్రమం కొనసాగిస్తామని ఆయన తెలిపారు. ప్రజల్లో రహదారి భద్రతపై అవగాహన కల్పించడమే దీని లక్ష్యమని చెప్పారు.

ర్యాలీలో భాగంగా పలువురు సాధారణ ప్రజలు, ప్రభుత్వ అధికారులు, డ్రైవర్లు, ఇలా ప్రతీ వర్గంతోనూ సమావేశాలు నిర్వహించి వారిలో అవగాహన కల్పిస్తానని పరిమాల్‌ తెలిపారు. ‘రోడ్డు భద్రత అందరి బాధ్యత’ అనే విషయాన్ని ప్రతి ఒక్కరి మెదళ్లలో నాటుకునేలా చేస్తానని అన్నారు. అస్సాం రవాణాశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్‌ వరకు రాష్ట్రంలో 6,001 రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకోగా.. 2,606 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 40.89 శాతం ప్రమాదాలు సాయంత్రం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్యలోనే చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉందని, వాళ్లకు అవగాహన కల్పించేందుకు తనవంతు కృషి చేస్తానని పరిమాల్‌ పేర్కొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని