Published : 04 Mar 2023 15:28 IST

IMA: దగ్గు కేసులు.. యాంటీబయాటిక్స్‌ వాడకంపై హెచ్చరిక!

దిల్లీ: కొన్నాళ్లుగా దేశవ్యాప్తంగా నిరంతర దగ్గు(Persistent Cough) కేసులు, కొన్ని సందర్భాల్లో జ్వరంతోకూడిన దగ్గు కేసులు నమోదవుతున్నాయి. అయితే, వీటిలో చాలా కేసులకు ‘ఇన్‌ఫ్లుయెంజా ఏ’ ఉప రకం ‘హెచ్3ఎన్2(H3N2)’ వైరస్‌ కారణమవుతోందని భారత వైద్య పరిశోధన మండలి(ICMR) నిపుణులు వెల్లడించారు. గత రెండు, మూడు నెలలుగా ఇది విస్తృతంగా వ్యాప్తిలో ఉందని తెలిపారు. ఇతర సబ్‌టైప్‌లతో పోల్చితే ఇది ఎక్కువగా ఆసుపత్రిలో చేరికలకు కారణమవుతోందని చెప్పారు.

మరోవైపు.. దేశవ్యాప్తంగా దగ్గు, జలుబు, వికారం కేసులు పెరుగుతున్నట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) గుర్తించింది. అయితే, వాటి చికిత్సకు యాంటీబయాటిక్స్‌ (Antibiotics)ను విచక్షణారహితంగా వాడొద్దని సూచించింది. ‘ఈ ఇన్ఫెక్షన్‌ సాధారణంగా అయిదు నుంచి వారం రోజుల వరకు ఉంటుంది. మూడు రోజుల్లో జ్వరం తగ్గిపోతుంది. దగ్గు మూడు వారాల వరకు ఉంటుంది. 15 ఏళ్లలోపు, 50 ఏళ్లు పైబడిన వారు ఇన్‌ఫెక్షన్‌కు గురయ్యే అవకాశాలు ఎక్కువ. వాయు కాలుష్యం కూడా కేసుల పెరుగుదలకు కారణమవుతోంది’ అని తెలిపింది.

ఈ ఇన్ఫెక్షన్లతో బాధపడుతోన్న రోగులకు యాంటీబయాటిక్స్ కాకుండా రోగ లక్షణాలకు మాత్రమే చికిత్స అందించాలని వైద్యులకు సూచించింది. ‘ప్రస్తుతం ప్రజలు అజిత్రోమైసిన్, అమోక్సిక్లావ్ వంటి యాంటీబయాటిక్స్‌ను ఇష్టారాజ్యంగా వాడుతున్నారు. ఇది యాంటీబయాటిక్స్‌ నిరోధకతకు దారి తీస్తుంది. కాబట్టి, వాటి వాడకాన్ని నిలిపేయాలి. లేనిపక్షంలో, అవసరమైన సందర్భాల్లో అవి పనిచేయకుండా పోయే ప్రమాదం ఉంది’ అని ఐఎంఏ ఒక ప్రకటనలో పేర్కొంది.

డయేరియా, మూత్రనాళ ఇన్ఫెక్షన్‌ల చికిత్సకు ఉపయోగించే అమోక్సిసిలిన్, నార్‌ఫ్లోక్సాసిన్‌, ఒప్రోఫ్లోక్సాసిన్, ఆఫ్లోక్సాసిన్, లెవోఫ్లోక్సాసిన్‌ వంటి యాంటీబయాటిక్స్‌లను విపరీతంగా వాడుతున్నారని తెలిపింది. ‘కొవిడ్ సమయంలో అజిత్రోమైసిన్, ఐవర్‌మెక్టిన్‌లను విస్తృతంగా వినియోగించారు. ఇది కాస్త.. యాంటీబయాటిక్‌ నిరోధకతకు దారితీసింది. ఈ నేపథ్యంలో రోగులకు యాంటీబయాటిక్స్ సూచించే ముందు.. అది బ్యాక్టీరియల్‌ ఇన్‌ఫెక్షనా? కాదా? అని నిర్ధారించుకోవడం అవసరం’ అని ఐఎంఏ సూచించింది.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts