కరోనా వేళ.. కళ్లుచెమర్చే మరో ఘటన!

మహమ్మారి కరోనా మానవత్వాన్ని చంపేస్తోంది. కళ్లెదుట ఎవరు చనిపోతున్నా దగ్గరికి వెళ్ల లేని పరిస్థితి. దేశంలో ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు కోకొల్లలు. తాజాగా మహారాష్ట్రలోని పుణెలో జరిగిన ఓ ఘటన కళ్లు చమర్చేలా చేస్తోంది...

Published : 30 Apr 2021 22:45 IST

పుణె: కరోనా మహమ్మారి మానవత్వాన్ని చంపేస్తోంది. కళ్లెదుటే చనిపోతున్నా దగ్గరికి వెళ్ల లేని దుస్థితి. దేశంలో ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు కోకొల్లలు. తాజాగా మహారాష్ట్రలోని పుణెలో జరిగిన ఓ ఘటన కళ్లు చమర్చేలా చేస్తోంది.

ఏమైందో ఏమో.. ఆ కన్నతల్లి మరణించింది. ఆమెకు 18 నెలల ఓ బాలుడు. అభం శుభం తెలియని ఆ చిన్నారి మృతదేహం పక్కనే కూర్చొని ఏడుస్తున్నాడు. అప్పటికే రెండు రోజులైంది. ఇంటి నుంచి దుర్వాసన వస్తుండటంతో చుట్టుపక్కల వారు పోలీసులకు ఫోన్‌ చేసి చెప్పారు. పోలీసులు వచ్చినా.. స్థానికులు మాత్రం అక్కడికి వచ్చేందుకు భయపడ్డారు. కారణం కొవిడ్‌. గత శనివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  పోలీసులు వచ్చి తలుపులు పగలగొట్టి చూడగా.. శవం పక్కన బిక్కుబిక్కుమంటూ కూర్చున్న ఆ బాలుడు ఏడుస్తూ కనిపించాడు. కనీసం ఆ చిన్నారికి ఆహారం ఇచ్చేందుకు కూడా స్థానికులు ముందుకురాలేదు. దీంతో మహిళా కానిస్టేబుళ్లు సుశీల, రేఖ.. పాలు, బిస్కెట్లు తెప్పించి బాలుడికి ఇచ్చారు.

‘‘నాక్కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒకరికి ఆరేళ్లు. ఇంకొకరికి ఎమిదేళ్లు. ఈ చిన్నారి కూడా సొంత కొడుగ్గానే అనిపించింది. చాలా ఆకలిగా ఉన్నట్లుంది.. గబగబా పాలు తాగేశాడు’’ అని సుశీల చెప్పుకొచ్చారు. చిన్నపాటి జ్వరం తప్ప ఆ బాలుడు ఆరోగ్యంగానే ఉన్నాడని రేఖ చెప్పారు. పాలు, బిస్కెట్లు తిన్నాక చిన్నారిని కరోనా పరీక్ష నిమిత్తం దగ్గర్లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు వివరించారు. పరీక్షల్లో నెగటివ్‌గా నిర్ధారణ అయిందని చెప్పారు. అయితే తల్లి ఎలా మృతి చెందిందనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని