300కి.మీ.. 400 కార్లతో..సైరన్లు మోగిస్తూ భాజపా నుంచి కాంగ్రెస్‌కు

మధ్యప్రదేశ్(Madhya Pradesh) అసెంబ్లీ ఎన్నికల ముందు కేంద్రమంత్రి, భాజపా నేత జ్యోతిరాదిత్య సింధియాకు ఎదురుదెబ్బ తగిలింది. ఆయన సన్నిహితుడు భాజపాను వీడి తిరిగి కాంగ్రెస్‌లో చేరారు. 

Published : 15 Jun 2023 14:14 IST

భోపాల్‌: 300 కి.మీ మేర 400 కార్ల కాన్వాయ్‌తో హడావుడి సృష్టించారు ఓ రాజకీయ నేత. తన బలాన్ని చాటుకుంటూ భాజపాను వదిలి తిరిగి సొంతగూడు కాంగ్రెస్‌కు చేరారు. మధ్యప్రదేశ్‌(Madhya Pradesh)లోని శివ్‌పురి నుంచి భోపాల్‌ వరకు సైరన్లు మోగించుకుంటూ కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. ప్రస్తుతం దానికి సంబంధిత దృశ్యాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

బైజనాథ్‌ సింగ్(Baijnath Singh).. 2020లో ప్రముఖ నేత జ్యోతిరాదిత్య సింధియా(Jyotiraditya Scindia)తో కలిసి కాంగ్రెస్ నుంచి భాజపాలో చేరారు. ఈ తిరుగుబాటుతో మధ్యప్రదేశ్‌(Madhya Pradesh)లోని కమల్‌నాథ్‌(Kamal Nath) నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలింది. ఆ తర్వాత శివరాజ్‌ సింగ్‌ చౌహాన్ సారథ్యంలో భాజపా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ రోజున తిరుగుబాటుకు నాయకత్వం వహించిన సింధియా ఇప్పుడు విమానయాన శాఖ మంత్రిగా ఉన్నారు. ఇక బైజనాథ్‌ సింగ్ విషయానికొస్తే.. ఈ ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ కోసం ఆయన గట్టిగా ప్రయత్నించినట్లు తెలుస్తోంది. అయితే, అది లభిస్తుందనే నమ్మకం లేకపోవడంతో తిరిగి కాంగ్రెస్‌లో చేరినట్లు తెలుస్తోంది. 

మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్, సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్‌ సమక్షంలో బైజ్‌నాథ్‌ సింగ్(Baijnath Singh) కాంగ్రెస్‌లో చేరారు. ఆయనతో పాటు 15మంది జిల్లా స్థాయి నేతలు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా శివపురి నుంచి 400 కార్ల కాన్వాయ్‌తో భోపాల్‌లోని కాంగ్రెస్ కార్యాలయానికి చేరారు. హారన్లు మోగించుకుంటూ హడావుడిగా అక్కడకు చేరుకున్నారు. అయితే, వీరి తీరును పలువురు నెటిజన్లు విమర్శిస్తున్నారు. చట్టప్రకారం అత్యవసర సేవలకు సంబంధించిన వాహనాలు మాత్రమే రోడ్లపై సైరన్లు మోగించడానికి అనుమతి ఉందని, కానీ దీనికి విరుద్ధంగా రాజకీయ నాయకులు తరచూ తమ సామర్థ్యాలను ప్రదర్శించుకోవడానికి ఇలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ నాయకుల కార్లపై ఎర్ర బుగ్గలను కోర్టు నిషేధించిన తర్వాత ఈ వైఖరి ఎక్కువగా కనిపిస్తోందని వ్యాఖ్యానించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని