Amrapali Case: మీరు జైల్లో ఉంటేనే బెటర్‌.. ‘ఆమ్రపాలి’ కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్య

వేలాది మంది ఇళ్ల కొనుగోలుదారులను మోసగించిన ఆమ్రపాలి గ్రూప్‌ (Amrapali Group) మాజీ సీఎండీ అనిల్‌ కుమార్‌పై తాము సానుభూతి చూపించలేమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఆయనకు బెయిల్‌ ఇవ్వబోమని స్పష్టం చేసింది.

Updated : 05 May 2023 18:16 IST

దిల్లీ: ఆమ్రపాలి గ్రూప్‌ (Amrapali Group ) నిధుల అవకతవకల కేసులో ఆ సంస్థ మాజీ సీఎండీ అనిల్‌ కుమార్‌ శర్మ (Anil Kumar Sharma) బెయిల్‌ పిటిషన్‌ను సుప్రీంకోర్టు (Supreme Court) తిరస్కరించింది. ఇళ్ల కొనుగోలుదారులను మోసగించిన ఆయనపై తాము సానుభూతి చూపించలేమని జస్టిస్‌ అజయ్‌ రస్తోగి, జస్టిస్‌ బేలా ఎం త్రివేదిలతో కూడిన ధర్మాసనం తెలిపింది.

ఈ సందర్భంగా అనిల్‌ శర్మ బెయిల్‌ పిటిషన్‌పై కోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ‘‘మీరు వేల మందిని మోసగించారు. ఇది సాదాసీదా మోసం కాదు. మీరేం చేశారో ఈ కోర్టుకు బాగా తెలుసు. మీ నేరం చాలా తీవ్రమైనది. ఇళ్ల కొనుగోలుదారులు (Home Buyers) ఎంతోకాలం కష్టపడి సంపాదించుకున్న డబ్బును.. వారి జీవితకాల సేవింగ్స్‌ను దోచుకున్నారు. మీ వల్ల వేల మంది ఇబ్బంది పడుతున్నారు. వారి భవిష్యత్తును మీరు గందరగోళంలో పడేశారు. వారి సమస్యకు మేం పరిష్కారం కూడా కనుగొనలేకపోతున్నాం. సానుభూతి చూపించేందుకు మీరు ఏ విధంగానూ అర్హులు కాదు. మీరు జైల్లో ఉండటమే ఉత్తమం..!’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అనిల్‌ బెయిల్‌ అభ్యర్థనపై దర్యాప్తు సంస్థలకు నోటీసులిచ్చేందుకు నిరాకరించిన కోర్టు.. అతడి పిటిషన్‌ను కొట్టేసింది.

ఉత్తర్‌ప్రదేశ్‌ (Uttar Pradesh)లోని గ్రేటర్‌ నోయిడా పరిధిలో ఫ్లాట్లు నిర్మించి ఇస్తామని ఆమ్రపాలి గ్రూప్‌ (Amrapali Group) దాదాపు 42వేల మంది నుంచి డబ్బులు తీసుకుంది. ఎంతకీ ఇళ్లు కట్టించకపోవడంతో మోసపోయామని గ్రహించిన పలువురు కొనుగోలుదారులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై గతంలో విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం.. కంపెనీ కార్యకలాపాలపై ఫొరెన్సిక్‌ తనిఖీ నిర్వహించాలని ఆదేశించింది. ఆ తనిఖీల్లో రూ.5,619 కోట్ల నిధులను కంపెనీ వివిధ అనుబంధ సంస్థల్లోకి దారి మళ్లించిందని ఫోరెన్సిక్‌ నివేదికలో తేలింది. ఆ నివేదిక ఆధారంగా అనిల్‌ శర్మతో పాటు కంపెనీకి చెందిన పలువురు డైరెక్టర్లను అరెస్టు చేశారు. మోసం, ఇతర కేసుల కింద వారంతా 2018 నుంచి జైల్లో ఉన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని