Covaxin for Children: చిన్నారులకు టీకా.. నివేదిక సమర్పించిన భారత్‌ బయోటెక్‌

చిన్నారుల కోసం రూపొందించిన కొవాగ్జిన్‌ టీకా ప్రయోగాలను ముగించుకున్న భారత్‌ బయోటెక్‌ ఆ నివేదికను భారత ఔషధ నియంత్రణ సంస్థ (DCGI)కు అందజేసింది.....

Updated : 07 Oct 2021 11:23 IST

హైదరాబాద్‌: 18 ఏళ్లలోపు వారికి కరోనా వైరస్‌ను ఎదుర్కొనే వ్యాక్సిన్‌ మరికొన్ని రోజుల్లోనే అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. చిన్నారుల కోసం రూపొందించిన కొవాగ్జిన్‌ టీకా ప్రయోగాలను ముగించుకున్న భారత్‌ బయోటెక్‌.. ఆ నివేదికను భారత ఔషధ నియంత్రణ సంస్థ (DCGI)కు అందజేసింది. ఈ విషయాన్ని భారత్‌ బయోటెక్‌ బుధవారం వెల్లడించింది. పిల్లలపై రెండు, మూడు దశ ప్రయోగాలు పూర్తి చేసినట్లు గత నెలలోనే సంస్థ ప్రకటించింది. డీసీజీఐ అనుమతి లభిస్తే భారత్‌లో పిల్లలకు వేసే మొట్టమొదటి టీకా కొవాగ్జిన్‌ కానుంది.

18 ఏళ్లలోపు చిన్నారుల కోసం రూపొందించిన కొవాగ్జిన్‌ 2/3 దశల ప్రయోగాలు పూర్తయినట్లు గత నెలలో భారత్‌ బయోటెక్‌ వెల్లడించింది. సమాచార విశ్లేషణ కొనసాగుతున్నట్లు తెలిపింది. దాదాపు వెయ్యి మంది వాలంటీర్లపై ఈ ప్రయోగాలు నిర్వహించినట్లు ఆ సంస్థ సీఎండీ కృష్ణ ఎల్లా వివరించారు. ఇప్పటికే 18ఏళ్ల పైబడిన వారికి కొవాగ్జిన్‌ టీకా ఉత్పత్తిని గణనీయంగా పెంచామన్నారు. ఒకవేళ ఇతర భాగస్వామ్య సంస్థలు తయారీని ప్రారంభిస్తే నెలకు 10కోట్ల డోసుల ఉత్పత్తి సాధ్యమని.. ఇందుకు ఇండియన్‌ ఇమ్యూనాలాజికల్స్‌, హెస్టర్‌ బయోసైన్సెస్‌తో ఇప్పటికే ఒప్పందం చేసుకున్నట్లు స్పష్టం చేశారు.

కొవాగ్జిన్‌ టీకాను అత్యవసర వినియోగ వ్యాక్సిన్ల జాబితా (ఈయూఎల్‌)లో చేర్చాలన్న అంశంపై వచ్చే వారంలో తుది నిర్ణయం తీసుకోనున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) వెల్లడించింది. డబ్ల్యూహెచ్‌వో, స్వతంత్ర నిపుణుల బృందం వచ్చే వారంలో భేటీ అయి కొవాగ్జిన్‌ టీకా మూడు దశల క్లినికల్‌ ట్రయల్స్‌ డేటాను, భద్రత, సామర్థ్యం, రోగ నిరోధకత తదితర అంశాలను సమీక్షించి అత్యవసర వినియోగ జాబితాలో చేర్చే అంశంపై తుది నిర్ణయం తీసుకోనుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని