Bharat Jodo Yatra: కర్ణాటకలో రాహుల్‌ పోస్టర్ల చించివేత.. ప్రభుత్వంపై కాంగ్రెస్‌ విమర్శలు

కర్ణాటకలోని చామరాజనగర్‌ జిల్లాలో ఏర్పాటు చేసిన రాహుల్‌ గాంధీ పోస్టర్లు చించివేయడం కలకలం రేపింది. ఇది అధికార పార్టీ పనేనని కాంగ్రెస్‌ ఆరోపించింది.

Published : 30 Sep 2022 01:12 IST

బెంగళూరు: కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ తలపెట్టిన భారత్‌ జోడో పాదయాత్ర (Bharat Jodo Yatra) శుక్రవారం కర్ణాటకలోకి ప్రవేశించనుంది. ఆయన పర్యటనకు ఒక్కరోజు ముందు రాహుల్‌కు ఆహ్వానం పలుకుతూ కర్ణాటకలోని చామరాజనగర్‌ జిల్లాలో ఏర్పాటు చేసిన పోస్టర్లు చించివేయడం కలకలం రేపింది. ఇది అధికార పార్టీ పనేనని కాంగ్రెస్‌ ఆరోపించింది.

సెప్టెంబర్‌ 7న ప్రారంభమైన భారత్‌ జోడో యాత్ర తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో పూర్తయ్యింది. రేపటి నుంచి కర్ణాటకలోకి ప్రవేశపెట్టనుంది. రాహుల్‌ పర్యటన నేపథ్యంలో కర్ణాటక ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ భారీ ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా కేరళ సరిహద్దు జిల్లా అయిన చామరాజనగరలో రాహుల్‌కు స్వాగతం పలుకుతూ పోస్టర్లు ఏర్పాటు చేశారు. అయితే, రాహుల్‌తో పాటు కర్ణాటక కాంగ్రెస్‌ నేతలున్న పోస్టర్లను ఎవరో గుర్తు తెలీని వ్యక్తులు చించివేశారు.

ఇది ముమ్మూటికీ ‘40 శాతం కమీషన్‌ బొమ్మై సర్కారు పనే’ అంటూ కాంగ్రెస్‌ ఆరోపించింది. భారత్‌ టోడో (భాజపానుద్దేశించి) గూండాల పనే ఇది అంటూ కర్ణాటక కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జి రణ్‌దీప్‌ సూర్జేవాలా ఆరోపించారు. ధరల పెరుగుదల, నిరుద్యోగం, అసమానతలు, విభజనకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరును ఎవరూ ఆపలేరని ట్వీట్‌ చేశారు. కొన్ని పోస్టర్లను చించివేయడంతో పాటు మరికొన్నింటిని తగలబెట్టారని కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ ఆరోపించారు. ఎన్ని చేసినా తాము తలొగ్గేది లేదని, ఆ విషయాన్ని భాజపా గమనించాలని డీకే శివకుమార్‌ విలేకరులతో అన్నారు. ఈ ఘటనపై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఒకవేళ వారు జోక్యం చేసుకోకుంటే తర్వాత ఏం చేయాలన్నది తాము చూస్తామని చెప్పారు. ఈ వ్యవహారంపై పోలీస్‌స్టేషన్‌లో ఆ పార్టీ ఫిర్యాదు చేసింది. దీనిపై సీఎం బసవరాజ్‌ బొమ్మై స్పందించారు. ఎవరు ‘భారత్‌ జోడో’ చేస్తున్నారో ఎవరు ‘టోడో’ చేస్తున్నారో ప్రజలకు తెలుసని వ్యాఖ్యానించారు. ఎవరి పోస్టర్లూ చించాల్సిన అవసరం భాజపాకు లేదన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని