కుమారుడి శవం ఇచ్చేందుకు ‘లంచం’ డిమాండ్‌.. డబ్బుల్లేక బిచ్చమెత్తిన తండ్రి

కన్నబిడ్డను కోల్పోయిన బాధలో ఉన్న తల్లిదండ్రుల పట్ల కనికరం చూపించాల్సింది పోయి.. అమానుషంగా ప్రవర్తించారో ఆసుపత్రి సిబ్బంది. రూ.50వేలు ఇస్తేనేగానీ కొడుకు మృతదేహాన్ని అప్పగించబోమన్నారు.

Updated : 09 Jun 2022 10:41 IST

పట్నా: కన్నబిడ్డను కోల్పోయి కుమిలిపోతున్న తల్లిదండ్రుల పట్ల కనికరం చూపించాల్సింది పోయి.. అమానుషంగా ప్రవర్తించారో ఆసుపత్రి సిబ్బంది. రూ.50వేలు ఇస్తేనేగానీ వారి కుమారుడి మృతదేహాన్ని అప్పగించబోమన్నారు. అంత మొత్తం లేని ఆ నిరుపేద తండ్రి డబ్బు కోసం వీధివీధి తిరుగుతూ బిచ్చమెత్తుకున్నారు. ఈ అమానవీయ ఘటన బిహార్‌లోని సమస్తిపూర్‌లో చోటుచేసుకుంది.

కుమారుడు మృతదేహాన్ని ఇచ్చేందుకు ఆసుపత్రి సిబ్బంది డబ్బులు డిమాండ్‌ చేయడంతో.. సొమ్ము కోసం ఆ తల్లిదండ్రులు ఊరంతా తిరుగుతూ భిక్షమెత్తుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ‘‘నా కుమారుడు కొన్ని రోజుల క్రితం కన్పించకుండా పోయాడు. అతడు చనిపోయాడని, సమస్తిపూర్‌లోని సర్దార్‌ ఆసుపత్రిలో మృతదేహం ఉంది.. వచ్చి తీసుకెళ్లాలని నాకు ఇటీవల ఫోన్ కాల్‌ వచ్చింది. ఆసుపత్రికి వెళ్తే.. రూ.50వేలు ఇస్తేనే శవాన్ని అప్పగిస్తామని చెప్పారు. మేం చాలా పేద వాళ్లం. అంతమొత్తం ఎక్కడినుంచి తెచ్చేది..’’అంటూ మృతుడి తండ్రి మహేశ్‌ ఠాకూర్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌ కావడంతో ఆసుపత్రి సిబ్బంది నిర్వాకంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ఆసుపత్రిలో పనిచేస్తోన్న చాలా మంది కాంట్రాక్ట్‌ ఉద్యోగులే. గత కొన్ని రోజులుగా వారికి జీతాలు సరిగా లేకపోవడంతో ఇలా రోగుల బంధువుల నుంచి డబ్బులు డిమాండ్‌ చేసి తీసుకుంటున్నట్లు స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

ఈ ఘటనపై ఆసుపత్రి యాజమాన్యం స్పందించింది. ఇది అమానవీయ ఘటన అని, బాధ్యులపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొంది. దీనిపై దర్యాప్తు చేపట్టినట్లు జిల్లా అదనపు మెజిస్ట్రేట్‌ వినయ్‌ కుమార్‌ రాయ్‌ తెలిపారు. అయితే, మహేశ్ కుమారుడి మృతదేహం పోలీసు కస్టడీలో ఉందని, అందువల్లే అప్పగించడం సాధ్యం కాలేదన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. 


Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని