Birbhum killings: చంపాలనే ఉద్దేశంతోనే ఇళ్లకు నిప్పు.. 21 మందిపై ఎఫ్‌ఐఆర్‌

పశ్చిమ బెంగాల్‌లోని బీర్‌భూం జిల్లాలో 8 మంది సజీవ దహనం కేసు దర్యాప్తును సీబీఐ వేగంగా చేపడుతోంది. ఈ నేపథ్యంలోనే కీలక విషయాలను వెల్లడించింది......

Published : 27 Mar 2022 01:49 IST

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని బీర్‌భూం జిల్లాలో 8 మంది సజీవ దహనం కేసు దర్యాప్తును సీబీఐ వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలోనే కీలక విషయాలను వెల్లడించింది. ఈ కేసులో 21 మంది అనుమానితుల పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేసినట్లు తెలిపింది. ‘ప్రతీకారం’తోనే ఈ హత్యలు జరిపినట్లు పేర్కొంది. తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ (టీఎంసీ)కి చెందిన బర్షాల్‌ గ్రామ పంచాయతీ ఉప ప్రధాన్‌ భాదు షేక్‌ హత్యకు ప్రతీకారంగానే ఈ హత్యలు జరిగినట్లు స్పష్టం చేసింది. వ్యక్తులను చంపాలనే ఉద్దేశంతోనే 70-80 మంది వ్యక్తుల గుంపు బాధితులను ఇళ్లలో ఉంచి నిప్పు పెట్టినట్లు సీబీఐ ఎఫ్‌ఆర్‌ నమోదు చేసింది.

ఈ కేసు దర్యాప్తు చేపట్టాలని హైకోర్టు శుక్రవారం సీబీఐని ఆదేశించింది. ఏప్రిల్‌ 7లోగా దర్యాప్తు నివేదికను తమకు సమర్పించాలని జస్టిస్‌ ప్రకాశ్‌ శ్రీవాస్తవ, జస్టిస్‌ ఆర్‌.భరద్వాజలతో కూడిన ధర్మాసనం తెలిపింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను, నిందితులను సీబీఐకి అప్పగించాలని బెంగాల్‌ ప్రభుత్వం ఏర్పాటుచేసిన సిట్‌కు ఆదేశాలు జారీ చేసింది.  బీర్‌భూం కేసును హైకోర్టు సుమోటోగా స్వీకరించిన విషయం తెలిసిందే. తదుపరి విచారణ ఏప్రిల్‌ 7న ఉంటుంది.

మార్చి 21 అర్ధరాత్రి జరిగిన ఈ దుర్ఘటనలో దుండగులు బోగ్‌టూయిలోని పది ఇళ్లకు నిప్పు పెట్టారు. ఇద్దరు పిల్లలు సహా 8 మంది బుగ్గిపాలయ్యారు. హత్యకు ముందు బాధితులను  కొట్టి అనంతరం సజీవదహనం చేసినట్లు పోస్టుమార్టం నివేదిక వెల్లడించింది. ఈ కేసులో ఇప్పటివరకు 20 మందిని అరెస్టు చేయగా.. పలువురు పోలీసులను సస్పెండు చేశారు. ఈ సంఘటన దేశవ్యాప్తంగా అందరినీ కలచివేసిందని, కేంద్ర దర్యాప్తు సంస్థకు రాష్ట్రం సహకరించాలని కోర్టు సూచించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని