Bihar: లాలూజీ.. మీ ఇంట్లోకి పాము మళ్లీ చొరబడింది..!

అనేక రాజకీయ నాటకీయ పరిణామాల తర్వాత బిహార్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటవుతోంది. భాజపాతో బంధాన్ని తెంచుకున్న జేడీ(యు) నేత నీతీశ్ కుమార్‌.. కొద్ది సేపట్లోనే ఆర్జేడీతో జట్టుకట్టి పూర్వ సంబంధాలను

Updated : 10 Aug 2022 11:07 IST

నీతీశ్‌తో పొత్తు నేపథ్యంలో భాజపా కౌంటర్‌

పట్నా: అనేక రాజకీయ నాటకీయ పరిణామాల తర్వాత బిహార్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటవుతోంది. భాజపాతో బంధాన్ని తెంచుకున్న జేడీ(యు) నేత నీతీశ్ కుమార్‌.. కొద్ది సేపట్లోనే ఆర్జేడీతో జట్టుకట్టి పూర్వ సంబంధాలను పునరుద్ధరించుకున్నారు. అయితే నీతీశ్ తీరుపై భాజపా నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. తాజాగా కేంద్రమంత్రి గిరిరాజ్‌ సింగ్‌ ట్విటర్‌ వేదికగా.. లాలూ ప్రసాద్‌ యాదవ్‌ను ఉద్దేశిస్తూ కొత్త పొత్తుపై వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు. ఐదేళ్ల క్రితం లాలూ చేసిన ఓ ట్వీట్‌ను ఉటంకిస్తూ ‘‘మీ ఇంట్లోకి పాము చొరబడింది’’ అని రాసుకొచ్చారు. కేంద్రమంత్రి ట్వీట్‌ వెనుక ఉద్దేశమేంటంటే..

2017లో ఆర్జేడీతో తెగదెంపులు చేసుకున్న నీతీశ్‌ కుమార్‌.. భాజపాతో చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత నీతీశ్‌ను ఉద్దేశిస్తూ లాలూ అప్పుడు ఓ ట్వీట్‌ చేశారు. ‘‘నీతీశ్‌ ఓ పాము లాంటి వ్యక్తి. పాము ఎలాగైతే కుబుసం విడుస్తుందో.. నితీశ్‌కు కూడా ప్రతి రెండేళ్లకోసారి కొత్త చర్మం వస్తుంది. ఇందులో ఏమైనా సందేహాలున్నాయా?’’ అని అప్పట్లో జేడీ(యు) నేతపై మండిపడ్డారు. ఈ ట్వీట్‌ను ప్రస్తావిస్తూ కేంద్రమంత్రి గిరిరాజ్‌ విమర్శలు గుప్పించారు. ‘‘ఆ పాము ఇప్పుడు మీ ఇంట్లోకి మళ్లీ చొరబడింది’’ అంటూ చురకలంటించారు.

2015 బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల సమయంలో జేడీ(యు), ఆర్జేడీ, కాంగ్రెస్‌ కలిసి మహా కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో విజయం సాధించాయి. అప్పుడు నీతీశ్ సీఎం అవ్వగా.. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. అయితే రెండేళ్లకే వీరి బంధానికి ముగింపు పలుకుతూ నీతీశ్‌ కూటమి నుంచి తప్పుకొన్నారు. ఆ తర్వాత భాజపాతో పొత్తు పెట్టుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 2020 ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయం సాధించడంతో మళ్లీ నీతీశ్‌ సీఎం అయ్యారు.

అయితే కూటమి ప్రభుత్వానికి తానే సారథ్యం వహిస్తున్నప్పటికీ.. భాజపా పార్టీ తన మాటను చెల్లుబాటు కానివ్వట్లేదని గతకొంతకాంగా నీతీశ్ అసంతృప్తిగా ఉన్నారు. తన రాజకీయ మనుగడకు కాషాయ పార్టీ నుంచి ముప్పు పొంచి ఉందని భావించి.. వెంటనే తన రాజకీయ చతురతను ఉపయోగించారు. భాజపాతో బంధాన్ని తెంచుకుని.. మళ్లీ ఆర్జేడీతో చేతులు కలిపారు. కొత్త పొత్తు చర్చల సందర్భంగా నీతీశ్.. తేజస్వీతో మాట్లాడుతూ.. గతమంతా మర్చిపోదామని, కొత్త అధ్యాయాన్ని ప్రారంభిద్దామని చెప్పినట్లు ఆర్జేడీ వర్గాలు వెల్లడించాయి. కూటమి నుంచి వైదొలిగి తాను పొరబాటు చేశానని, అందుకు తనను క్షమించాలని కోరినట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని