Flight: మాస్కో-దిల్లీ విమానంలో బాంబు ఉందంటూ ఈ-మెయిల్‌.. ఎయిర్‌పోర్టులో హైఅలర్ట్‌

మాస్కో నుంచి 400 మంది ప్రయాణికులతో దిల్లీ బయల్దేరిన విమానానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

Published : 14 Oct 2022 10:13 IST

దిల్లీ: మాస్కో నుంచి 400 మంది ప్రయాణికులు, సిబ్బందితో దిల్లీ బయల్దేరిన ఓ విమానంలో బాంబు ఉందంటూ అధికారులకు వచ్చిన బెదిరింపు ఈ-మెయిల్‌ కలకలం సృష్టించింది. దీంతో అప్రమత్తమైన భద్రతా సంస్థలు ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రాయంలో భద్రతను కట్టుదిట్టం చేసి, విస్తృత తనిఖీలు చేపట్టారు.

మాస్కో నుంచి దిల్లీ బయల్దేరిన విమానంలో బాంబు ఉందంటూ సీఐఎస్‌ఎఫ్‌కు గురువారం అర్ధరాత్రి ఈ-మెయిల్‌ వచ్చింది. ఈ విమానం దిల్లీ ఎయిర్‌పోర్టులో శుక్రవారం తెల్లవారుజామున 3.20 గంటల ప్రాంతంలో ల్యాండ్‌ అయ్యింది. బెదిరింపుల నేపథ్యంలో అంతకుముందే ఎయిర్‌పోర్టులో భద్రతను పెంచారు. విమానం ల్యాండ్ అవగానే అందులోని 386 మంది ప్రయాణికులు, 14 మంది సిబ్బందిని సురక్షితంగా కిందకు దించి.. విస్తృత తనిఖీలు చేపట్టారు. అయితే ఈ తనిఖీల్లో అనుమానాస్పద వస్తువులేమీ కన్పించకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం విమానాన్ని ఐసోలేషన్‌లో ఉంచారు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు దిల్లీ పోలీసులు వెల్లడించారు.

ఇటీవల భారత గగనతలంలోకి వచ్చిన ఓ ఇరాన్‌ విమానానికి కూడా ఇలాంటి బెదిరింపులే వచ్చిన విషయం తెలిసిందే. మన గగనతలం మీదుగా ఎగురుతున్న ఇరాన్‌ విమానంలో బాంబు ఉన్నట్లు సమాచారం అందడంతో.. అధికారులు హుటాహుటిన ముందుజాగ్రత్త చర్యలు చేపట్టారు. భారత వాయుసేనకు చెందిన రెండు ఫైటర్‌ జెట్లు ఆ విమానాన్ని అనుసరించాయి కూడా. బెదిరింపుల నేపథ్యంలో ఆ విమానాన్ని జైపుర్‌ లేదా చండీగఢ్‌లో దించాలని అధికారులు పైలట్లకు సూచించారు. అందుకు వారు నిరాకరించడంతో ఆ విమానం భారత గగనతలం వదిలి చైనా వెళ్లిపోయింది. ఆ తర్వాత బాంబు బెదిరింపు ఉత్తిదే అని తేలింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని