corona:అధ్యక్షుడు ప్రసంగిస్తుంటే..గిన్నెలతో శబ్దం

సాక్షాత్తూ దేశాధ్యక్షుడు ప్రసంగిస్తోన్న వేళ..ప్రజలు గిన్నెలతో పెద్ద శబ్దాలు చేసుకుంటూ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.

Published : 04 Jun 2021 01:06 IST

బ్రెజిల్‌లో బొల్సొనారో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత

బ్రెసిలియా: సాక్షాత్తూ దేశాధ్యక్షుడు ప్రసంగిస్తోన్న వేళ..ప్రజలు గిన్నెలతో పెద్ద శబ్దాలు చేసుకుంటూ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. బుధవారం సాయంత్రం బ్రెజిల్‌లోని పలు నగరాల్లో గిన్నెల శబ్దాలు వినిపించాయి. మహమ్మారి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధ్యక్షుడు జైర్ బొల్సొనారో పట్ల ఆ దేశస్థులు ఈ రకంగా తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇదే విషయమై ఇటీవల వీధుల్లోకి వచ్చి ప్రజలు ఆందోళన చేపట్టారు. 

బొల్సొనారో కరోనా వైరస్‌ను మొదటి నుంచి చిన్నచూపు చూశారు. చిన్నపాటి ఫ్లూ అంటూ కొట్టిపారేశారు. ఆ నిర్లక్ష్యం బ్రెజిల్‌ను వణికించింది. ఒకదశలో నాలుగువేలకు పైగా మరణాలు సంభవించాయి. నిన్న కూడా దాదాపు లక్ష కేసులు, రెండు వేలకు పైగా మరణాలు నమోదయ్యాయని అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. ఇక, బుధవారం టెలివిజన్ ప్రసంగంలో బొల్సొనారో మాట్లాడుతూ..తన ప్రభుత్వ విజయాల గురించి చెప్పుకొచ్చారు. ఆర్థిక వృద్ధి గురించి మాట్లాడారు. అయితే కొత్త విషయాల గురించి మాత్రం ఏ ప్రస్తావనా తేలేదు. ఈ ప్రసంగం సమయంలోనే ప్రజలు గిన్నెలతో శబ్దాలు చేస్తూ నిరసన తెలిపారు. 

కరోనా కారణంగా ప్రజల నుంచి ఆయన ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. శనివారం దేశవ్యాప్తంగా 16 నగరాల్లో వేల సంఖ్యలో ప్రజలు వీధుల్లోకి వచ్చి ఆందోళన చేపట్టారు. ప్రతిపక్ష పార్టీలు, విద్యార్థి సంఘాలు ఈ నిరసనలో పాల్గొన్నాయి. అతి పెద్ద నగరమైన సావోపాలోలో అయితే ఏకంగా రక్త పిశాచి అని రాసి ఉన్న బెలూన్లను ప్రదర్శించి ప్రజలు తమ ఆవేదనను వెళ్లగక్కారు. వరల్డో మీటర్ గణాంకాల ప్రకారం..బ్రెజిల్‌లో 1,67,20,081 మందికి కరోనా సోకగా..4,67,706 మంది ప్రాణాలు కోల్పోయారు. కేసుల పరంగా మూడో స్థానంలో ఉన్న ఆ దేశం..మరణాల విషయంలో రెండో స్థానానికి చేరింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని