Farmers Protest: రైతు సంఘాలను మరోసారి చర్చలకు ఆహ్వానించిన కేంద్రం

Farmers Protest..తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఆందోళన చేపట్టిన రైతులను కేంద్ర ప్రభుత్వం మరోసారి చర్చలకు ఆహ్వానించింది.

Updated : 14 Feb 2024 17:33 IST

దిల్లీ: రైతులతో చర్చలు జరిపేందుకు  కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి అర్జున్ ముండా తెలిపారు. బుధవారం మరోసారి పంజాబ్‌ నుంచి హరియాణాలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన వారిపై (Farmers Protest) పోలీసులు టియర్‌ గ్యాస్ ప్రయోగించారు. ఈ నేపథ్యంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘చర్చలకు అనువైన వాతావరణాన్ని కల్పించాలని రైతు సంఘాలకు విజ్ఞప్తి చేస్తున్నా. కేంద్రం అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటుంది. వారి ఆందోళనల వల్ల ప్రజలకు ఇబ్బందులు కలుగకూడదు. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి’’ అని మంత్రి తెలిపారు. 

ఘర్షణ పడేందుకు రాలేదు: రైతు సంఘాలు

మరోవైపు ‘దిల్లీ చలో’ కార్యక్రమంలో పాల్గొనే రైతులపై కొందరు తప్పుడు అభిప్రాయాలను కలగజేస్తున్నారని రైతు సంఘం నాయకుడు సర్వణ్‌ సింగ్ పంథేర్‌ తెలిపారు. కేంద్రంతో ఘర్షణ పడేందుకు తాము రాలేదన్నారు. ప్రధాని మోదీ (PM Modi) పెద్ద మనసుతో ఎమ్‌ఎస్‌పీకి చట్టబద్ధత కల్పించాలని కోరారు. ప్రభుత్వ ఆహ్వానంపై చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. మంగళవారం ఆందోళనలో భాగంగా గాయపడిన రైతులతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) ఫోన్‌లో మాట్లాడినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తుందన్న ఆయన, రైతులపై దాడిని ఖండించారు. వారికి కాంగ్రెస్‌ పార్టీ పూర్తి మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. 

ఎమ్‌ఎస్‌పీని కాంగ్రెస్‌ తిరస్కరించింది!

ఈ క్రమంలో స్వామినాథన్‌ కమిటీ సిఫార్సులపై 2010లో భాజపా సభ్యుడు ప్రకాశ్‌ జావడేకర్‌ రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు అప్పటి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి కేవీ థామస్‌ లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చారు. దానికి సంబంధించిన కాపీ తాజాగా వెలుగులోకి వచ్చింది. అందులో పంటకు కనీస మద్దతు ధర (MSP) ఉత్పత్తి వ్యయం కంటే 50 శాతం ఎక్కువ ఉండాలని కమిటీ సిఫార్సు చేసినట్లు తెలిపారు. అయితే, దాన్ని మన్మోహన్‌ సింగ్ ప్రభుత్వం  అంగీకరించలేదని వెల్లడించారు. ఎమ్‌ఎస్‌పీ, ఉత్పత్తి వ్యయం అనుసంధానం మిగిలిన వాటిపై ప్రతికూల ప్రభావం చూపుతుందని, అందుకే ప్రభుత్వం అమలు చేయలేదన్నారు. మంగళవారం రాహుల్‌ గాంధీ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే ఎమ్‌ఎస్‌పీకి చట్ట బద్ధత కల్పిస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు