Modi-Rahul Gandhi: మోదీ ‘ఓబీసీ’ కాదన్న రాహుల్‌.. బదులిచ్చిన కేంద్రం

ప్రధాని మోదీ(Modi) ఓబీసీ కాదంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు కేంద్రం సమాధానం ఇచ్చింది. 

Published : 08 Feb 2024 17:29 IST

దిల్లీ: ప్రధాని మోదీ(PM Modi)ని ఉద్దేశించి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలను కేంద్రప్రభుత్వం తోసిపుచ్చింది. ‘రాహుల్‌  ప్రకటనపై వాస్తవాలు’ అంటూ మోదీ జన్మించిన కులం గురించి స్పష్టత ఇచ్చింది. ప్రధాని మోదీ ఘాంచీ కులానికి చెందిన కుటుంబంలో జన్మించారని, 2000 సంవత్సరంలో గుజరాత్‌లో అధికారంలో ఉన్న భాజపా(BJP) ఆ కులాన్ని ఓబీసీ విభాగంలో చేర్చిందని వివరించారు.

‘గుజరాత్‌లో ఒక సర్వే అనంతరం మండల్ కమిషన్‌ 91(A) ఇండెక్స్‌ కింద ఓబీసీ జాబితాను తయారుచేసింది. అందులో ఘాంచీ కులం పేరు కూడా ఉంది. దీనిని ఓబీసీ జాబితాలో చేర్చేందుకు జులై 25, 1994లో నోటిఫికేషన్ ఇచ్చారు. అప్పుడు మోదీ స్వరాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఆ తర్వాత ఏప్రిల్‌ 4, 2000లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌ ఆధారంగా దానిని ఓబీసీ జాబితాలోకి చేర్చారు. ఈ రెండు ప్రకటనలు ఇచ్చిన సమయంలో మోదీ అధికారంలో లేరు’ అని కేంద్రం వెల్లడించింది.

కులగణనకు మోదీ అంగీకరించరు: రాహుల్ కీలక వ్యాఖ్యలు

ఎన్నికల సమయంలో మాత్రమే మోదీ(Modi)కి తాను ఓబీసీననే విషయం గుర్తుకువస్తుందని కొద్దిరోజుల క్రితం రాహుల్‌ విమర్శించిన సంగతి తెలిసిందే. లేకపోతే కులగణన కోరిన ప్రతిసారీ దేశంలో ఉన్నది ధనిక, పేద అనే రెండు కులాలు మాత్రమే అని చెప్తారన్నారు. రాహుల్‌ వ్యాఖ్యలను ఉద్దేశించి బుధవారం పార్లమెంట్‌లో మోదీ స్పందించారు. ‘దళితులు, ఆదివాసీలు, వెనకబడిన వర్గాల వారికి కాంగ్రెస్‌ వ్యతిరేకంగా పనిచేసింది. మాజీ ప్రధాని నెహ్రూను వారు గుడ్డిగా అనుసరిస్తున్నారు. రిజర్వేషన్లను ఆయన గట్టిగా వ్యతిరేకించారు. మా హయాంలో ఎస్సీ, ఎస్టీలకు అన్ని పదవుల్లో విశేష ప్రాధాన్యం ఇచ్చాం’ అని వెల్లడించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని