Karnataka CM: సీఎం ఎంపికపై కసరత్తు.. ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ..!

కర్ణాటక ముఖ్యమంత్రిగా (Karnataka CM) ఎవరు బాధ్యతలు చేపట్టనున్నారనే విషయంపై ఆసక్తి నెలకొన్న సమయంలో.. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను (Mallikarjun Kharge) మాజీ సీఎం సిద్ధరామయ్య (Siddaramaiah) కలుసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Published : 14 May 2023 14:57 IST

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో (Karnataka Elections) విజయం సాధించిన కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతోంది. అయితే, ముఖ్యమంత్రిగా ఎవరిని నియమించాలనే విషయంపై పార్టీలో తర్జనభర్జన కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ఆదివారం సాయంత్రం కాంగ్రెస్‌ పార్టీ సీఎల్పీ సమావేశం (CLP Meet) నిర్వహించనుంది. ఇదే సమయంలో కాంగ్రెస్‌ పార్టీలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను (Mallikarjun Kharge) సీనియర్‌ నేత సిద్ధరామయ్య (Siddaramaiah) కలుసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

నిర్ణయం జరిగిందా..?

కాంగ్రెస్‌ పార్టీలో కీలక నేతలుగా ఉన్న సిద్ధరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌లు (DK Shivakumar) ముఖ్యమంత్రి పదవి పోటీలో ముందువరుసలో ఉన్నారు. ఈ విషయంపై పార్టీ అధిష్ఠానం ఇప్పటికే కసరత్తు ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ కావడం ఆసక్తికరంగా మారింది. అయితే, ఇందులో ఎటువంటి రాజకీయ ప్రాధాన్యం లేదని.. కేవలం మర్యాదపూర్వక సమావేశం మాత్రమేనని పార్టీ జనరల్‌ సెక్రటరీ ప్రియాంకా గాంధీ వెల్లడించారు. సీఎల్పీ సమావేశంలోనే ముఖ్యమంత్రి అభ్యర్థిపై నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు.

కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరన్న విషయంపై చర్చ జరుగుతుండటంపై ఏఐసీసీ జనరల్‌ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌ స్పందించారు. కాంగ్రెస్‌ పార్టీకి సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌లు ఇద్దరూ గుండెకాయలాంటి వారిని.. ముఖ్యమంత్రిని ఎన్నుకునేందుకు కొంత సమయం పడుతుందన్నారు. ముఖ్యమంత్రి పదవికి మల్లికార్జున ఖర్గే పేరు పరిశీలనలో ఉందా? అన్న ప్రశ్నకు బదులిస్తూ.. అటువంటి పరిస్థితి లేదన్నారు.

పరిశీలకులుగా ముగ్గురు..

ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎన్నుకునేందుకు గాను ఆదివారం సాయంత్రం 5.30కు సీఎల్‌పీ భేటీ కానుంది. ఈ సమావేశంలోనే సీఎం ఎవరన్నది తేలే అవకాశం ఉంది. కొత్తగా ఎన్నికైన వారంతా నేటి సాయంత్రానికి బెంగళూరు చేరుకోవాలని పార్టీ హైకమాండ్‌ ఆదేశాలు జారీ చేసింది. ఇలా సీఎల్పీ నేతను ఎంపిక చేసేందుకు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్‌ కుమార్‌ శిండే, జితేంద్ర సింగ్‌, దీపక్‌ బబారియాలను కాంగ్రెస్‌ అధిష్ఠానం పరిశీలకులుగా నియమించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని