
పోప్ ఫ్రాన్సిస్‌కు శస్త్రచికిత్స
వాటికన్ సిటీ: పెద్దపేగు సంబంధిత శస్త్రచికిత్స నిమిత్తం పోప్ ఫ్రాన్సిస్ (84) ఆదివారం రోమ్‌లోని గెమెల్లి ఆసుపత్రిలో చేరారు. ఈ మేరకు ఆయన అధికారిక ప్రతినిధి మాటియో బ్రూని వివరాలు వెల్లడించారు. కొద్ది రోజులుగా పోప్ ‘‘సింప్టమాటిక్ డైవర్టిక్యులర్ స్టెనోసిస్’ అనే పెద్ద పేగు సంబంధిత అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్లు తెలిపారు. ఆయనకు శస్త్రచికిత్స చేయనున్నట్టు బ్రూని పేర్కొన్నారు. 2013లో పోప్‌గా ఎన్నికైననాటి నుంచి ఆయన ఆసుపత్రిలో చేరడం ఇదే తొలిసారి అని చెప్పారు. ఆదివారం సెయింట్ పీటర్స్ స్క్వేర్ వద్ద ఆశీస్సులు అందజేస్తూ వేలాది ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడారని వివరించారు.
పోప్ ఫ్రాన్సిస్ యుక్త వయసులో ఉన్నప్పుడు తలెత్తిన అనారోగ్య సమస్య కారణంగా ఆయన ఊపిరితిత్తుల్లో ఒకవైపు కొంత భాగాన్ని తొలగించారు. అప్పటి నుంచి ఆయన శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు. సయాటికాతో నడుము కింది భాగంలో నొప్పితో ఆయన బాధపడుతున్నారు. అందుకోసం ఆయన ఫిజియో థెరపీ చేయించుకుంటున్నారు. 2014లోనూ ఉదర సంబంధిత అనారోగ్య సమస్యల కారణంగా అయన పలు ముఖ్యమైన కార్యక్రమాలను రద్దు చేసుకోవాల్సి వచ్చింది.
ఇవీ చదవండి
Advertisement