Pegasus: దేశాన్ని బిగ్‌బాస్‌ షోలా మార్చేశారు..!

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పెగాసస్ స్పైవేర్‌ను భారత్‌ 2017లోనే ఇజ్రాయెల్‌ నుంచి కొనుగోలు చేసినట్లు తాజాగా న్యూయార్స్ టైమ్స్ సంచలన కథనం వెల్లడించింది. దీనిపై కాంగ్రెస్ సహా విపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. స్పైవేర్‌ను వాడి అక్రమంగా నిఘా పెట్టడం దేశద్రోహం అంటూ కేంద్రంపై దాడి చేశాయి. 

Updated : 29 Jan 2022 15:05 IST

పెగాసస్‌పై న్యూయార్క్‌ టైమ్స్ కథనం.. విమర్శలు గుప్పిస్తోన్న విపక్షాలు

దిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పెగాసస్ స్పైవేర్‌ను భారత్‌ 2017లోనే ఇజ్రాయెల్‌ నుంచి కొనుగోలు చేసినట్లు తాజాగా న్యూయార్స్ టైమ్స్ సంచలన కథనం వెల్లడించింది. దీనిపై కాంగ్రెస్ సహా విపక్షాలు విమర్శలను పెంచాయి. స్పైవేర్‌ను వాడి అక్రమంగా నిఘా పెట్టడం దేశద్రోహం అంటూ కేంద్రంపై దాడి చేశాయి.

* ప్రజాస్వామ్య సంస్థలు, రాజకీయ నాయకులు, ప్రజలపై నిఘా పెట్టేందుకు మోదీ ప్రభుత్వం పెగాసస్‌ను కొనుగోలు చేసింది. ప్రభుత్వ వ్యవస్థలు, ప్రతిపక్ష నాయకులు, సాయుధ బలగాలు, న్యాయవ్యవస్థ.. ఇలా అందరూ ఫోన్‌ ట్యాపింగ్‌ దాడికి గురయ్యారు. ఇది దేశద్రోహం. మోదీ ప్రభుత్వం దేశద్రోహానికి పాల్పడింది... కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ

మోదీ ప్రభుత్వం ఎందుకు భారత్‌కు శత్రువు వలే ప్రవర్తించింది? యుద్ధంలో ఉపయోగించే ఆయుధాన్ని భారత ప్రజలపై ఎందుకు ప్రయోగించింది? చట్టవిరుద్ధంగా పెగాసస్‌ ద్వారా నిఘాకు పాల్పడటం దేశద్రోహం. ఎవరూ చట్టానికి అతీతులు కారు. న్యాయం జరిగేలా చూస్తాం... కాంగ్రెస్ సీనియర్ నేత మల్లిఖార్జున ఖర్గే

ఇది తిరుగులేని రుజువు... కాంగ్రెస్ అధికార ప్రతినిధి షామా మహమ్మద్‌

ప్రధాని మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారు? దీనిపై స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత ప్రధానమంత్రి కార్యాలయానికి ఉంది. రూ.300 కోట్ల ప్రజల డబ్బు చెల్లించి, దీనిని కొనుగోలు చేశారని న్యూయార్క్‌ టైమ్స్ కథనం వెల్లడించింది. పెగాసస్‌ అంశంపై సుప్రీంకోర్టు, పార్లమెంట్‌ను కేంద్రం తప్పుదోవ పట్టించిందని తాజా పరిణామం సూచిస్తోంది... కాంగ్రెస్ సీనియర్ నేత శక్తి సిన్హ్‌ గోహిల్‌

స్పైవేర్‌ను రక్షణ పరంగా కాకుండా.. ప్రతిపక్షాలు, పాత్రికేయులపై నిఘా పెట్టడానికి ఉపయోగించారు. భాజపాతోనే అది సాధ్యం. వారు దేశాన్ని బిగ్‌ బాస్‌ షోగా మార్చారు... శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది

రూ.300 కోట్లు పెట్టి పెగాసస్‌ను కొనుగోలు చేశారని వెల్లడైన కథనాన్ని మోదీ ప్రభుత్వం ఖండించాలి. దీనిపై ప్రభుత్వం ప్రాథమికంగా సుప్రీం, పార్లమెంట్‌ను తప్పుదారి పట్టించిందని ఇది సూచిస్తోంది.. భాజపా ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి

ఇదీ వివాదం..

ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్‌ఎస్‌వో గ్రూప్‌ రూపొందించిన ఈ స్పైవేర్‌ను కొన్ని దేశాలు వినియోగించుకుని.. రాజకీయ ప్రముఖులు, జర్నలిస్టులు, మానవ హక్కుల కార్యకర్తలపై నిఘా పెట్టినట్లు గతేడాది జులైలో అంతర్జాతీయ మీడియాలో కథనాలు రావడం తీవ్ర దుమారానికి దారితీసింది. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ సహా పలువురు రాజకీయ నాయకులు, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, ఇలా దేశంలో దాదాపు 300 మంది ఫోన్లను పెగాసస్‌తో హ్యాక్‌ చేసినట్లు అప్పట్లో ‘ది వైర్‌’ కథనం వెల్లడించింది. ఇది తీవ్ర వివాదం రేపడంతో పాటు పార్లమెంట్‌ను కూడా కుదిపేసిన విషయం తెలిసిందే. దీనిపై సమాధానం ఇవ్వాలంటూ ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. అయితే ఈ ఆరోపణలను కేంద్రం ఎప్పటికప్పుడు తోసిపుచ్చింది. ఆ వార్తలు నిజం కాదని తెలిపింది. ఈ వివాదం సుప్రీంకోర్టుకు చేరగా.. పెగాసస్‌ను వినియోగించారా? లేదా? అన్నదానిపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు ముగ్గురు సభ్యులతో స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేసింది. అయితే తాజాగా కథనం పూర్తిగా నిరాధారమని ఉన్నతస్థాయి ప్రభుత్వ వర్గాలు కొట్టిపారేసినట్లు జాతీయ మీడియా కథనాలు తెలిపాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని