Israel- Hamas: ఐరాసలో ఓటింగ్‌కు దూరం.. కేంద్రం వైఖరిని తప్పుబట్టిన కాంగ్రెస్‌

 గాజాకు సంఘీభావంగా యూఎన్‌ తీర్మానంపై ఓటింగ్‌కు భారత్‌ దూరంగా ఉండటాన్ని కాంగ్రెస్‌ పార్టీ వ్యతిరేకిస్తోందని సోనియా గాంధీ అన్నారు.

Updated : 30 Oct 2023 13:12 IST

దిల్లీ: ఇజ్రాయెల్‌ - హమాస్‌ మధ్య ఉద్రిక్తతల (Israel - Hamas Conflict) నేపథ్యంలో గాజాకు మానవతా సాయంపై ఐక్యరాజ్య సమితి (UN) లో ప్రవేశపెట్టిన తీర్మానంపై జరిగిన ఓటింగ్‌కు భారత్‌ దూరంగా ఉండటాన్ని కాంగ్రెస్‌ (Congress) పార్టీ వ్యతిరేకించింది. ఈ మేరకు కాంగ్రెస్‌ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ (Sonia Gandhi) ఓ వార్తా పత్రికకు రాసిన వ్యాసంలో కేంద్రం వైఖరిని తప్పుబట్టారు. కాంగ్రెస్‌ పార్టీ హమాస్‌ దాడులను తీవ్రంగా ఖండించిదని పేర్కొన్నారు. ఇజ్రాయెల్ ప్రతీకార దాడులతో గాజాలోని అమాయక ప్రజలు నిస్సహాయులుగా మారిపోయారని అన్నారు. ఇజ్రాయెల్‌తో శాంతియుతంగా కలిసుండేందుకు, పాలస్తీనా సార్వభౌమత్వం కోసం సుదీర్ఘ చర్చలకు మద్దతు ఇవ్వడమే కాంగ్రెస్‌ పార్టీ వైఖరిగా పేర్కొన్నారు. 

‘‘ఇజ్రాయెల్‌ - పాలస్తీనాల మధ్య న్యాయం జరగకుండా శాంతి నెలకొనే అవకాశం లేదు. గౌరవప్రదమైన ప్రపంచంలో హింసకు తావులేదు. ఇజ్రాయెల్‌ ప్రతీకార దాడులతో హమాస్‌ క్రూరపు చర్యలో పాల్గొనని అమాయకులైన మహిళలు, చిన్నారులు కూడా బలైపోతున్నారు. జెరూసలేం సహా పశ్చిమ ప్రాంతంలో ఇజ్రాయెల్‌ ప్రజలు పాలస్తీనా వాసులను వారి సొంత ప్రాంతాల నుంచి వెళ్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి ఇరు పక్షాలు శాంతియుత పరిష్కారం కనుగొనాలి. కాంగ్రెస్‌ పార్టీ ఇరు దేశాలతో ఉన్న స్నేహబంధాన్ని గౌరవిస్తుంది. ఇజ్రాయెల్‌కు సంఘీభావం ప్రకటించే క్రమంలో పాలస్తీనా వాసుల హక్కుల గురించి ప్రధాని ప్రకటన చేయలేదు. గాజాకు సంఘీభావంగా యూఎన్‌ తీర్మానంపై ఓటింగ్‌కు భారత్‌ దూరంగా ఉండటాన్ని కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. హమాస్‌ను నాశనం చేసే క్రమంలో గాజాలోని సాధారణ ప్రజలను బాధ్యులను చేస్తూ వారిపై దాడులు చేయడం బాధాకరం’’ అని సోనియా వ్యాసంలో పేర్కొన్నారు. 

ఖతార్‌లో ఉరిశిక్ష పడిన వారిని విడిపిస్తాం’.. బాధిత కుటుంబాలను కలిసిన జైశంకర్‌

యూఎన్‌ తీర్మానంపై ఓటింగ్‌కు భారత్‌ గైర్హాజరవడాన్ని కాంగ్రెస్‌ సహా కొన్ని ప్రతిపక్ష పార్టీలు తప్పుబట్టాయి. గాజాలో మానవతా సంక్షోభంపై ఆందోళన చెందుతున్నామని, అదే సమయంలో ఉగ్రవాదంపై రాజీపడే ప్రశ్నే లేదని భారత్‌ స్పష్టంచేసింది. ‘ఈ తీర్మానం హమాస్‌ మిలిటెంట్ల దాడులను ఖండించలేదు. మిగిలిన విషయాలనూ ప్రస్తావించలేదు. మిలిటెంట్ల దాడులను ఖండిస్తూ ప్రతిపాదించిన సవరణను ఆమోదించలేదు. అందుకే ఓటింగ్‌కు గైర్హాజరయ్యాం’ అని భారత్‌ వివరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు