
తమిళనాడులో 1న స్కూళ్లు, కాలేజీలు ప్రారంభం.. నైట్ కర్ఫ్యూ ఎత్తివేత
చెన్నై: రాష్ట్రంలో కరోనా ఉధ్దృతి కొనసాగుతున్నప్పటికీ తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొవిడ్ ఆంక్షల్ని సడలించింది. ఫిబ్రవరి 1 నుంచి రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలల్లో భౌతిక తరగతులు పునః ప్రారంభించనున్నట్టు వెల్లడించింది. అలాగే, రాష్ట్రంలో కొవిడ్ కట్టడికి ఇటీవల ప్రకటించిన రాత్రిపూట కర్ఫ్యూను శుక్రవారం ఉండదని స్పష్టంచేసింది. ఈ నెల 30న ఆదివారం అమలుచేయాలని ఇప్పటికే ప్రకటించిన పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ను సైతం రద్దు చేస్తున్నట్టు వెల్లడించింది. అలాగే, వివాహ వేడుకలకు 100 మంది; అంత్యక్రియలకు 50మందికి మించరాదని నిబంధన విధించింది. ప్రార్థనా స్థలాలు అన్ని రోజుల్లోనూ తెరిచే ఉంటాయని స్పష్టంచేసింది. రెస్టారెంట్లు, సెలూన్లు, సినిమా థియేటర్లు, జిమ్‌లు, యోగా సెంటర్లకు మాత్రం 50శాతం ఆక్యుపెన్సీతోనే నిర్వహించుకోవాలని ప్రభుత్వం సూచించింది. మరోవైపు, తమిళనాడులో గురువారం రోజు 28 వేలకు పైగా కొవిడ్ కేసులు నమోదు కాగా.. ఒక్క చెన్నై నగరంలోనే 5,591 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి.
కేరళలో మళ్లీ 50వేలకు పైనే కేసులు!
కేరళలోనూ కొవిడ్ విజృంభణ కొనసాగుతోంది. తాజాగా మళ్లీ 50వేలకు పైగా కొత్త కేసులు వెలుగుచూశాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 1.16 లక్షలకు పైగా టెస్టులు చేయగా 51,739 మందికి పాజిటివ్‌గా తేలింది. కొవిడ్ బాధితుల్లో మరో 68 మంది మృతిచెందగా.. 42,653 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3,09,489 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అయితే, కేవలం 3.6 శాతం మంది మాత్రమే ఆస్పత్రిపాలైన వారు ఉండటం గమనార్హం. ఎర్నాకుళంలో అత్యధికంగా 9708 కొత్త కేసులు రాగా.. తిరువనంతపురంలో 7675, త్రిస్సూరులో 3934 కొత్త కేసులు నమోదయ్యాయి.
కర్ణాటకలో ఒకేరోజు 67వేల మందికి పైగా డిశ్చార్జి
కర్ణాటకలో కరోనా ఉద్ధృతి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. బుధవారంతో పోలిస్తే దాదాపు 10వేల కేసులు తగ్గాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో కర్ణాటకలో 38,083 కేసులు రాగా.. 67,236 మంది కోలుకోవడం గమనార్హం. తాజాగా 49మంది కొవిడ్ కాటుకు బలైపోయారు. కొత్త కేసుల్లో ఒక్క బెంగళూరు అర్బన్‌లోనే 17,717 కేసులు రాగా.. 43,997 మంది కోలుకున్నారు. 12 మంది మృతిచెందారు. ప్రస్తుతం కర్ణాటకలో 3,28,711 యాక్టివ్ కేసులు ఉన్నట్టు అధికారులు వెల్లడించారు.