Published : 31 May 2021 11:12 IST

Wuhan: ఇలా అయితే, కొవిడ్‌-26, కొవిడ్‌-32 తప్పవు!

వాషింగ్టన్‌: దాదాపు ఏడాదిన్నర గడుస్తున్నా కరోనా మూలాలు మాత్రం ఇంకా అంతుచిక్కడం లేదు. కాల గమనంలో ఈ మహమ్మారి పుట్టుకపై అనేక ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. కొందరు వుహాన్‌లోని వైరాలజీ ల్యాబ్‌ నుంచే వైరస్‌ బయటకొచ్చిందని వాదిస్తుండగా.. మరికొందరేమో ప్రకృతి నుంచే సహజంగా పుట్టుకొచ్చిందంటున్నారు. అయితే, గత కొన్ని రోజులుగా వుహాన్‌ ల్యాబ్‌ థియరీని బలపరుస్తూ పలు సంస్థలు, నిపుణులు కథనాలు ప్రచురిస్తున్నారు. ఈ తరుణంలో అమెరికాకు చెందిన ఇద్దరు నిపుణులు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

వుహాన్‌ ల్యాబ్‌ నుంచే వైరస్‌ పుట్టుకొచ్చిందంటూ వస్తున్న వాదనకు మద్దతు పెరుగుతోందని ట్రంప్‌ హయాంలో అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ(ఎఫ్‌డీఏ)కు కమిషనర్‌గా పనిచేసిన స్కాట్‌ గాట్లియెబ్‌ అన్నారు. వుహాన్‌ ల్యాబ్‌పై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని నిరూపించేలా చైనా ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు ఇవ్వలేదని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం గాట్లియెబ్‌ ప్రముఖ ఔషధ తయారీ సంస్థ ఫైజర్‌ బోర్డులో సభ్యుడిగా ఉన్నారు. సీబీఎస్‌ ఛానెల్‌లో ప్రసారమయ్యే ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

మరో వైద్య నిపుణుడు పీటర్‌ హోటెజ్‌ మాట్లాడుతూ.. కొవిడ్‌-19 మూలాలు తెలియనంత వరకు ప్రపంచానికి భవిష్యత్తు మహమ్మారుల ముప్పు తప్పదని హెచ్చరించారు. కొవిడ్‌-26, కొవిడ్‌-32 మహమ్మారులు ఉద్భవించొచ్చని అభిప్రాయపడ్డారు. పీటర్‌ ప్రస్తుతం ‘టెక్సాస్‌ చిల్డ్రన్స్‌ హాస్పిటల్‌ సెంటర్‌ ఫర్‌ వ్యాక్సిన్‌ డెవలప్‌మెంట్‌’కు కో-డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.

కరోనా వైరస్‌ వుహాన్‌లోని వైరాలజీ ల్యాబ్‌లోనే ఉద్భవించిందని వస్తున్న వాదనను బలపరుస్తూ ఇటీవల పలు కథనాలు తెరపైకి వచ్చాయి. చైనా శాస్త్రవేత్తలే ల్యాబ్‌లో సృష్టించినట్లు బలం చేకూర్చే అధ్యయనం ఒకటి తాజాగా వెలువడింది. పైగా అది గబ్బిలాల నుంచి సహజంగా ఉద్భవించినట్లు నమ్మించేందుకు ‘రివర్స్‌ ఇంజినీరింగ్‌’కు ప్రయత్నించినట్లు తెలిపారు. కొవిడ్‌-19 కారక సార్స్‌-కోవ్‌-2 వైరస్‌కు ‘విశ్వసనీయమైన సహజసిద్ధ పూర్వరూపం’ ఏదీ లేదని చెప్పారు. సార్స్‌-కోవ్‌-2 వైరస్‌ను చైనా శాస్త్రవేత్తలే కృత్రిమంగా సృష్టించారని బ్రిటిష్‌ ప్రొఫెసర్‌ అంగూస్‌ డాల్‌గ్లిష్‌, నార్వే శాస్త్రవేత్త బిర్గర్‌ సొరెన్‌సెన్‌ తమ నివేదికలో పేర్కొన్నారు. చైనాలోని గుహల్లో ఉండే గబ్బిలాల్లో ఉండే సహజసిద్ధ కరోనా వైరస్‌లోని ‘మూలపదార్థం’ను సేకరించి, దానిలోకి కొత్త ‘స్పైక్‌’ను చొప్పించారని వీరు తెలిపారు. తద్వారా ఈ వైరస్‌ ప్రమాదకరంగా, తీవ్రంగా వ్యాపించేలా రూపాంతరం చెందిందన్నారు. మరోవైపు బాహ్య ప్రపంచంలో సార్స్‌కోవ్‌-2 వైరస్‌ వ్యాపించడానికి ముందే వుహాన్‌ ల్యాబ్‌లోని చాలా మంది పరిశోధకులు అస్వస్థతకు గురయ్యారని.. వీరిందరిలో కొవిడ్‌19 లేదా సాధారణ ఫ్లూలో కనిపించే జ్వరం, పొడిదగ్గు వంటి లక్షణాలు కనిపించినట్లు విశ్వసనీయ సమాచారం అందిందని అమెరికా ఇంటెలిజెన్స్‌ వెల్లడించింది. ఈ పరిణామాలతో వుహాన్‌ థియరీ మరోసారి చర్చనీయాంశంగా మారింది.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని