Vaccination: కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్ల జారీపై కేంద్రం కీలక నిర్ణయం!

కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ డిజిటల్‌ సర్టిఫికెట్ల జారీ విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనాపై పోరాటంలో భాగంగా దేశంలో తొలిసారి తయారుచేసిన .....

Published : 23 Aug 2021 19:17 IST

దిల్లీ: కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ డిజిటల్‌ సర్టిఫికెట్ల జారీ విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనాపై పోరాటంలో భాగంగా దేశంలో తొలిసారి తయారుచేసిన వ్యాక్సిన్ల క్లినికల్‌ ట్రయల్స్‌లో పాల్గొన్న వారంతా వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్లు పొందవచ్చని ప్రకటించింది. కరోనా కట్టడే లక్ష్యంగా మన దేశంలో కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ టీకాలు తయారైన విషయం తెలిసిందే. ఆయా వ్యాక్సిన్ల క్లినికల్‌ ట్రయల్స్‌లో భాగస్వాములైన దాదాపు 11,300 మందికి పైగా ఈ డిజిటల్‌ వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్‌ను కొ-విన్‌ పోర్టల్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకొనేలా కేంద్రం వెసులుబాటు కల్పించింది. వ్యాక్సిన్‌ ట్రయల్స్‌లో పాల్గొన్నవారికి డిజిటల్‌ వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్లు జారీ చేయాలంటూ విజ్ఞప్తులు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ మేరకు 11,349మంది డేటాను ఐసీఎంఆర్‌ అందజేసిందని తెలిపింది. 

మీ అద్భుత సహకారానికి థాంక్స్‌: కేంద్రమంత్రి ట్వీట్‌

దీనిపై హర్షంవ్యక్తంచేస్తూ కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ ట్వీట్‌ చేశారు. కొ-విన్‌ పోర్టల్‌తో పాటు ఆరోగ్య సేతు, డిజిలాకర్‌, ఉమాంగ్‌ యాప్‌ల ద్వారా కూడా సర్టిఫికెట్లను పొందవచ్చని పేర్కొన్నారు. కొవిడ్‌ వ్యాక్సిన్ల పరిశోధన, చికిత్సలో వారి నిబద్ధత, అద్భుతమైన సహకారానికి దేశం కృతజ్ఞతలు తెలుపుతోందన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని