Bharat Biotech vaccine: భారత్‌ బయోటెక్‌ నాసల్‌ వ్యాక్సిన్‌కు అత్యవసర వినియోగ అనుమతి

కొవిడ్‌ నుంచి రక్షణ కల్పించేందుకు భారత్‌ బయోటెక్‌ రూపొందించిన ముక్కు ద్వారా ఇచ్చే చుక్కల మందుకు (నాసల్‌ వ్యాక్సిన్‌) అత్యవసర వినియోగ అనుమతి లభించింది.

Updated : 06 Sep 2022 20:10 IST

దిల్లీ: కొవిడ్‌ నుంచి రక్షణ కల్పించేందుకు భారత్‌ బయోటెక్‌ (Bharat Biotech) రూపొందించిన ముక్కు ద్వారా ఇచ్చే చుక్కల మందుకు (నాసల్‌ వ్యాక్సిన్‌) అత్యవసర వినియోగ అనుమతి లభించింది. ఈ మేరకు డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (DCGI) అనుమతి ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. 18 ఏళ్లు పైబడిన వారికి ఈ వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు అత్యవసర అనుమతులు మంజూరైనట్లు తెలిపారు. కొవిడ్‌పై భారత్‌ సాగిస్తున్న పోరును ఈ టీకా మరింత బలోపేతం చేస్తుందని మంత్రి పేర్కొన్నారు. శాస్త్ర సాంకేతిక రంగం, అందరి సహకారంతో భారత్‌ సమర్థంగా కొవిడ్‌ను ఓడిస్తామని మంత్రి ధీమా వ్యక్తంచేశారు. దేశంలో అనుమతి పొందిన తొలి నాసల్‌ వ్యాక్సిన్‌ ఇదే కావడం గమనార్హం.

నాసల్‌ వ్యాక్సిన్‌కు సంబంధించి సుమారు 4వేల మంది వాలంటీర్లపై భారత్‌ బయోటెక్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించింది. ఇందులో ఎవరిలోనూ సైడ్‌ ఎఫెక్ట్స్‌ గానీ, దుష్ప్రభావాలు కనిపించలేదని కంపెనీ తెలిపింది. ఈ టీకా పూర్తిగా సురక్షితమైందని, వ్యాధినిరోధక శక్తిని సమర్థంగా ప్రేరేపిస్తోందని గత నెల వెలువరించిన మూడో దశ ప్రయోగ ఫలితాల సందర్భంగా కంపెనీ పేర్కొంది. కొన్ని మార్పులు చేసిన చింపాంజీ అడినోవైరస్‌ వెక్టార్‌ సాయంతో ఈ టీకాను అభివృద్ధి చేసినట్లు తెలిపింది. ‘వాషింగ్టన్‌ యూనివర్శిటీ ఇన్‌ సెయింట్‌ లూయిస్‌’ భాగస్వామ్యంతో ప్రత్యేకంగా అభివృద్ధి చేసినట్లు వివరించింది. ఈ టీకాను నాసికా రంధ్రాల ద్వారా తీసుకోవాల్సి ఉంటుంది.

గర్వంగా ఉంది: డాక్టర్‌ కృష్ణా ఎల్లా

ముక్కు ద్వారా ఇచ్చే నాసల్‌ వ్యాక్సిన్‌కు అత్యవసర అనుమతులు మంజూరు అవ్వడంపై భారత్‌ బయోటెక్‌ సంతోషం వ్యక్తంచేసింది. గ్లోబల్‌ గేమ్‌ ఛేంజర్‌ అయిన తమ చుక్కల మందు ఇన్‌కోవాక్‌ (iNCOVACC)కు అనుమతులు లభించడం గర్వంగా ఉందని సంస్థ ఎండీ, ఛైర్మన్‌ డాక్టర్‌ కృష్ణా ఎల్లా పేర్కొన్నారు. భవిష్యత్‌లో సంభవించే అంటు వ్యాధులను ఎదుర్కొనేందుకు నాసల్‌ వ్యాక్సిన్‌ అభివృద్ధిని కొనసాగిస్తామని చెప్పారు. ఈ వ్యాక్సిన్‌ అభివృద్ధికి సహకరించిన కేంద్ర ఆరోగ్య శాఖ, సీడీఎస్‌సీఓ, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ బయోటెక్నాలజీ గవర్నర్‌మెంట్‌ ఆఫ్‌ ఇండియా, వాషింగ్టన్‌ యూనివర్సిటీ సెయింట్‌ లూయిస్‌కు కృష్ణా ఎల్లా ధన్యవాదాలు తెలిపారు. ప్రయోగాల్లో భాగంగా ఈ నాసల్‌ వ్యాక్సిన్‌ను ప్రైమరీ వ్యాక్సిన్‌గానూ, రెండు డోసుల వ్యాక్సిన్‌ తీసుకున్న వారికి బూస్టర్‌గానూ ఇవ్వగా.. మెరుగైన ఫలితాలు వచ్చాయని కంపెనీ తన ప్రకటనలో పేర్కొంది.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని