Rajnath Singh: పీవోకే పై అప్పుడే నిర్ణయం తీసుకోవాల్సింది: రాజ్‌నాథ్‌సింగ్‌

పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే) అంశంపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ మరోసారి స్పందించారు. 1971లో భారత్‌-పాకిస్థాన్‌ యుద్ధ సమయంలోనే దీనిపై గట్టి నిర్ణయం తీసుకొని ఉండాల్సిందని...

Published : 27 Sep 2022 01:42 IST

సిమ్లా: పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే) అంశంపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ మరోసారి స్పందించారు. 1971లో భారత్‌-పాకిస్థాన్‌ యుద్ధ సమయంలోనే దీనిపై గట్టి నిర్ణయం తీసుకొని ఉండాల్సిందని ఆయన అన్నారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని నాదౌన్‌లో అమరవీరుల కుటుంబాలను ఆయన సత్కరించారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్‌ సింగ్‌ మాట్లాడుతూ..‘‘ 1971 ఇండోపాక్‌ యుద్ధంలో విజయాన్ని పురస్కరించుకొని స్వర్ణోత్సవ వేడుకలను ఇటీవల ఘనంగా నిర్వహించుకున్నాం. ఈ యుద్ధం చరిత్రలో గుర్తుండిపోతుంది. ఇది ఆస్తుల కోసమో, అధికారం కోసమో జరిగిన యుద్ధం కాదు. మానవత్వం కోసం పోరాడి ప్రత్యర్థిపై విజయం సాధించాం. కానీ, ఒకింత బాధగా కూడా ఉంది. పీవోకే అంశంలో అప్పట్లోనే నిర్ణయం తీసుకొని ఉండాల్సింది’’ అని అన్నారు.

పాక్ అక్రమిత కశ్మీర్ భారత్‌లో భాగమని అదే వైఖరికి తాము కట్టుబడి ఉన్నామంటూ ఇటీవల  సింగ్‌ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. తాము ఎంతో భక్తితో కొలుచుకునే శారదా శక్తి పీఠం అక్కడే ఉందని ఆయన గుర్తు చేశారు. పాక్  ఆక్రమణలో ఉన్నప్పటికీ  పీవోకేలో ఒక్క కుటుంబానికి కూడా ఎలాంటి నష్టం జరగనీయబోమని తెలిపారు. భారత్ పై దుష్ట పన్నాగాలు పన్నేవారికి తగిన సమాధానం ఇచ్చేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నామంటూ పాకిస్థాన్‌కు హెచ్చరికలు పంపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని