వ్యాక్సిన్‌ తీసుకున్న వైద్యులు ఏం చెబుతున్నారు?

కరోనా నివారణకు దేశవ్యాప్తంగా వ్యాక్సిన్‌ పంపిణీ కార్యక్రమం మూడో రోజూ కొనసాగుతోంది. ఈ నెల 16న ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్‌ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ శ్రీకారం చుట్టగా.. .

Updated : 18 Jan 2021 18:10 IST

దిల్లీ: కరోనా నివారణకు దేశవ్యాప్తంగా వ్యాక్సిన్‌ పంపిణీ కార్యక్రమం మూడో రోజూ కొనసాగుతోంది. ఈ నెల 16న ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్‌ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ శ్రీకారం చుట్టగా.. కరోనా యోధులకు తొలి ప్రాధాన్యంగా టీకా అందిస్తున్న విషయం తెలిసిందే. దేశీయంగా అభివృద్ధి అయిన కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ టీకాలను వైద్య, పారిశుద్ధ్య, పోలీస్‌ శాఖలకు చెందిన సిబ్బందికి తొలుత అందిస్తున్నారు. ఇందులో భాగంగా టీకా తీసుకున్న అనంతరం దిల్లీ ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా, బెంగళూరు, ముంబయికి చెందిన పలువురు వైద్యులు తమ అనుభవాలను పంచుకున్నారు. 

నాకెలాంటి సైడ్‌ఎఫెక్ట్స్‌ రాలేదు: గులేరియా
టీకా వేయించుకున్న రెండు రోజుల తర్వాత దిల్లీ ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా తన అనుభవాన్ని వెల్లడించారు. ఈ టీకా తీసుకున్న తర్వాత తనకెలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఎదురుకాలేదని స్పష్టంచేశారు. ఉదయం నుంచి తాను పనిలోనే నిమగ్నమయ్యానన్న ఆయన.. యథావిథిగా సమావేశాలకు కూడా హాజరవుతున్నట్టు చెప్పారు. కరోనా మరణాల రేటును మరింతగా తగ్గించేందుకు ప్రజలంతా వ్యాక్సిన్‌ వేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ప్రతిఒక్కరూ టీకా వేయించుకోవాలి
టీకా పంపిణీతో దేశంలో ఓ పండుగ వాతావరణం ఏర్పడిందని బెంగళూరుకు చెందిన వైద్యుడు సందేశ్‌ ఖండేవాల్‌ అన్నారు. బెంగళూరు మెడికల్‌ కాలేజ్‌ అండ్‌ రీసెర్చి ఇన్‌స్టిట్యూట్‌లో న్యూరో సర్జన్‌గా పనిచేస్తున్న ఆయన  విక్టోరియా ఆస్పత్రిలో టీకా తీసుకున్నారు. టీకా పంపిణీలో ఎలాంటి ఆలస్యం జరగలేదన్నారు.  ఇప్పటివరకు తనకెలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ రాలేదని, ఇంజెక్షన్‌ చేసిన చోట ఎలాంటి నొప్పీ లేదన్నారు. టీకా వేయించుకొనే ముందు రోజే తనకు సంబంధిత ఆస్పత్రి నుంచి సందేశం వచ్చిందన్నారు. అలాగే, కరోనా వార్డులో పనిచేస్తున్న తనను టీకా వేయించుకొనేందుకు ఫోన్‌ కూడా వచ్చినట్టు తెలిపారు. ఉదయం 9గంటల వరకు సిద్ధంగా ఉండాలని చెప్పారని ఆయన వివరించారు. ప్రతి ఫ్రంట్‌లైన్‌ యోధుడూ తప్పకుండా వ్యాక్సిన్‌ వేయించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తద్వారా కరోనా ఇన్ఫెక్షన్‌ వేరొకరికి సోకకుండా కనీసం ఓ వారధిలాగైనా ఉండగలుగుతామని చెప్పారు. 

అసత్యాలు నమ్మొద్దు
తొలి రోజు కరోనా వ్యాక్సిన్‌ వేయించుకొని రెండున్నర గంటల తర్వాత కూడా తనకు ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ రాలేదని బెంగళూరులోని మణిపాల్‌ ఆస్పత్రి ఛైర్మన్‌ సుదర్శన్‌ భల్లాల్‌ తెలిపారు. వైద్య రంగంలో ఈ రోజు రక్తాక్షరాలతో లిఖించదగిన రోజుగా అభివర్ణించారు.  తాను వ్యాక్సినేషన్‌ సెంటర్‌లోకి వెళ్లినప్పటి నుంచి వచ్చేదాకా అంతా ప్రశాంతగా జరిగిందన్నారు. లోపలికి వెళ్లగానే తనకు ప్రొసీజర్‌ను వివరించారని, సైడ్‌ఎఫెక్ట్స్‌ గురించి కూడా చెప్పారన్నారు. వ్యాక్సిన్‌ ఇంజెక్షన్‌ ఇచ్చిన తర్వాత  దాదాపు అరగంట పాటు అబ్జర్వేషన్‌లో ఉంచారని తెలిపారు. ప్రతిఒక్కరూ టీకా తమ వంతు వచ్చినప్పడు టీకా వేయించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 

టీకాలతో సైడ్‌ ఎఫెక్ట్‌ల గురించి వస్తోన్న ఊహగానాలు, అసత్యాలను నమ్మొద్దని ఆయన కోరారు. ఈ టీకాలను అభివృద్ధి చేసిన మన శాస్త్రవేత్తలపై విశ్వాసం ఉంచాలన్నారు. టీకా వేయించుకున్న తర్వాత కూడా భౌతికదూరం పాటించడం, మాస్క్‌లు ధరించడం, తరచూ చేతులు శుభ్రం చేసుకోవడం వంటి జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఈ విషయంలో అజాగ్రత్త పనికిరాదన్నారు. దేశం నుంచి కరోనాను తరిమికొట్టేందుకు అందరం కలిసికట్టుగా పనిచేయాలని విజ్ఞప్తి చేశారు.

నా జీవితంలో ఇదో చరిత్రాత్మక దినం
ముంబయిలోని సియాన్‌ ఆస్పత్రి, వైద్యకళాశాల డీన్‌ మోహన్‌ జోషీ టీకాను అందుకున్నారు. ఆస్పత్రిలో పనిచేస్తున్న వారిలో 42మంది వివిధ విభాగాధిపతులు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లతో కలిసి ఆయన టీకా పొందారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. టీకా సురక్షితమైనదని తెలిపారు. ఆరోగ్య కార్యకర్తలందరూ తప్పనిసరిగా తీసుకోవాలని కోరారు. టీకా పంపిణీ ప్రారంభమైన రోజు తన జీవితంలో చరిత్రాత్మకమైన దినమన్నారు. అలాగే, రెస్పిరేటరీ మెడిసిన్‌ డిపార్ట్‌మెంట్‌కు చెందిన డాక్టర్‌ నీలకంఠ్‌ అవాడ్ మాట్లాడుతూ.. కరోనా అంతానికి వ్యాక్సినేషన్‌ సహకరిస్తుందన్నారు. కానీ భౌతికదూరం, మాస్క్‌లు ధరించడం వంటి జాగ్రత్తలు కొనసాగించాలని సూచించారు. భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌ టీకాకు సియాన్‌ ఆస్పత్రిలో జరిపిన క్లినికల్‌ ట్రయల్స్‌ను ఈయనే నిర్వహించారు. 

ఇదీ చదవండి..

రక్షణ @ 42 రోజులు

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts