DGCA: మౌత్‌ వాష్‌లు, టూత్‌ జెల్‌లు వాడొద్దు.. పైలట్లు, క్యాబిన్‌ సిబ్బందికి డీజీసీఏ కీలక సూచన

విమాన పైలట్లు, క్యాబిన్ సిబ్బంది ఆల్కహాల్‌తో కూడిన మౌత్‌ వాష్‌లు, టూత్‌ జెల్‌లు ఉపయోగించవద్దని డీజీసీఏ సూచించింది.

Published : 01 Nov 2023 21:42 IST

దిల్లీ: విమాన పైలట్లు (Pilots), క్యాబిన్‌ సిబ్బంది (Cabin Crew)కి డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (DGCA) కీలక సూచన చేసింది. ఆల్కహాల్‌తో కూడిన మౌత్‌ వాష్‌లు, టూత్‌ జెల్‌లు ఉపయోగించవద్దని సూచించింది. వాటి వల్ల బ్రీత్‌ ఎనలైజర్‌ పరీక్షల్లో మద్యం సేవించినట్లు పాజిటివ్‌ ఫలితాలు వస్తున్నాయని తెలిపింది. బ్రీత్‌ ఎనలైజర్‌, వైద్య పరీక్షలకు సంబంధించి విమానయాన పరిశ్రమ వర్గాల నుంచి సేకరించిన అభిప్రాయాల ఆధారంగా విమాన పైలట్లు, క్యాబిన్‌ సిబ్బంది నిబంధనల్లో పలు మార్పులు చేసినట్లు వెల్లడించింది. అంతకముందు ఆల్కహాల్‌తో కూడిన పెర్‌ఫ్యూమ్‌లు కూడా వాడకూడదని ముసాయిదాలో పేర్కొన్నప్పటికీ.. తాజా నిబంధనల్లో పెర్‌ఫ్యూమ్‌ అనే పదాన్ని తొలగించింది. 

‘‘క్యాబిన్‌ సిబ్బంది ఎవరూ ఆల్కహాల్‌తో కూడిన మౌత్‌ వాష్‌లు, టూత్‌ జెల్‌లు, ఔషధాలు ఉపయోగించకూడదు. వీటి వినియోగం వల్ల బ్రీత్‌ ఎనలైజర్‌ పరీక్షల్లో సిబ్బంది మద్యం సేవించినట్లు పాజిటివ్ ఫలితాలు వస్తున్నాయి. ఒకవేళ ఎవరైనా సిబ్బంది అలాంటి ఔషధాలు ఉపయోగిస్తుంటే.. బ్రీత్ ఎనలైజర్‌ పరీక్షలకు ముందు విమానయాన సంస్థ వైద్యుడిని సంప్రదించాలి. సిబ్బంది ఎవరైనా విధులకు హాజరయ్యే ముందు అనారోగ్యంగా ఉంటే ఆ విషయాన్ని విమానయాన సంస్థకు తెలియజేయాలి. దాంతో వారికి బ్రీత్‌ ఎనలైజర్‌ పరీక్ష నిర్వహించరు. విమానయాన సంస్థ వైద్యుడు వారిని పరీక్షించిన తర్వాతే విధులకు అనుమతించాలి’’ అని డీజీసీఏ సూచించింది.

హ్యాకింగ్‌ కలకలానికి ముందే యాపిల్‌ యూజర్లకు కేంద్రం అలర్ట్‌!

పైలట్లు, క్యాబిన్‌ సిబ్బందిపై పర్యవేక్షణలో భాగంగా ఫ్యూయల్‌ సెల్ టెక్నాలజీ ఆధారిత బ్రీత్‌ ఎనలైజర్‌ పరీక్షలను భారత్‌లో కార్యకలాపాలు సాగిస్తున్న విమానయాన సంస్థలన్నీ తప్పనిసరి చేశాయి. ఇందులో భాగంగా ప్యాసింజర్‌ విమానాలతోపాటు తీర్థయాత్ర స్థలాలకు విమానాలు నడిపే పైలట్లకు కూడా బ్రీత్‌ ఎనలైజర్‌ పరీక్షలు చేపట్టాలి. ఒకవేళ ఎవరైనా సిబ్బందికి బ్రీత్‌ ఎనలైజర్‌ పరీక్షల ఫలితాల్లో పాజిటివ్‌ అని నిర్ధరణ అయితే, వారిపై కఠిన చర్యలు ఉంటాయని తెలిపింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు