హ్యాకింగ్‌ కలకలానికి ముందే యాపిల్‌ యూజర్లకు కేంద్రం అలర్ట్‌!

దేశవ్యాప్తంగా యాపిల్ ఫోన్ల హ్యాకింగ్‌పై చర్చ నడుస్తోంది. అయితే, దీనికి ముందే యాపిల్‌ యూజర్లను కేంద్రం అలర్ట్‌ చేసింది.

Published : 01 Nov 2023 16:25 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తమ యాపిల్‌ (Apple) ఫోన్లు హ్యాక్‌ చేసేందుకు ప్రభుత్వ ప్రాయోజిత వ్యక్తులు యత్నించారంటూ విపక్షనేతలు ఆరోపించడం కలకలం రేపింది. మహువా మొయిత్రా, ప్రియాంక చతుర్వేది, శశిథరూర్‌, రాఘవ్‌ చడ్డా వంటి నేతలు ఆందోళన వ్యక్తంచేశారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం... సమగ్ర దర్యాప్తు జరిపిస్తామని ప్రకటించింది. అయితే, ఈ ఘటనకు ముందే యాపిల్‌ యూజర్లకు కేంద్రం అలర్ట్‌ జారీ చేయడం గమనార్హం. యాపిల్‌ ఉత్పత్తుల్లో భద్రతా పరమైన లోపాలు ఉన్నట్లు గుర్తించి ఓ హెచ్చరిక జారీ చేసింది.

ప్రభుత్వానికి చెందిన కంప్యూటర్‌ అత్యవసర స్పందన బృందం (CERT) యాపిల్‌ యూజర్లకు ఇటీవల ఓ అడ్వైజరీని జారీ చేసింది. ఐఫోన్‌, యాపిల్‌ వాచ్‌, మ్యాక్‌బుక్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌లతో పాటు సఫారీ బ్రౌజర్‌లోనూ సెక్యూరిటీ లోపాలు గుర్తించినట్లు సెర్ట్ పేర్కొంది. ఐఓఎస్‌, ఐప్యాడ్‌ ఓఎస్‌ 17.1 కంటే ముందు వెర్షన్లు, మ్యాక్‌ ఓఎస్‌ సోనోమా వెర్షన్‌ 14.1 కంటే ముందు వెర్షన్లు, వెంట్యురా వెర్షన్‌ 13.6.1, మానిటరీ వెర్షన్స్‌ 12.7.1 కంటే ముందు వెర్షన్లలో లోపాలు ఉన్నట్లు తెలిపింది. యాపిల్‌కు చెందిన ఇంటర్నెట్‌ బ్రౌజర్‌ సఫారీ 17.1 కంటే ముందు వెర్షన్లలో లోపాలు గుర్తించినట్లు సెర్ట్‌ పేర్కొంది. 

నెలలో 10 రోజులు ఆఫీసుకు రావాల్సిందే.. ఉద్యోగులకు ఇన్ఫోసిస్‌ సమాచారం

ఆయా ఉత్పత్తుల్లో బహుళ లోపాలు ఉన్నట్లు సెర్ట్‌ గుర్తించింది. దీంతో హ్యాకర్లు డివైజులను కంట్రోల్‌లోకి తీసుకుని సున్నితమైన సమాచారాన్ని తస్కరించే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ మేరకు అక్టోబర్‌ 27న సెర్ట్‌ అడ్వైజరీని జారీ చేసింది.  అంతకుముందూ ఇదే తరహా అలర్ట్‌ జారీ చేసింది. వెంటనే లేటెస్ట్‌ ఐఓఎస్‌, మ్యాక్‌ ఓఎస్‌, టీవీ ఓఎస్‌, వాచ్‌ ఓఎస్‌తో పాటు సఫారీ బ్రౌజర్‌ను కూడా అప్‌డేట్‌ చేసుకోవాలని యూజర్లకు సూచించింది. ఈ హెచ్చరిక వెలువడిన రోజుల వ్యవధిలోనే ప్రతిపక్ష ఎంపీలకు వార్నింగ్‌ సందేశాలు రావడం గమనార్హం. మరోవైపు హ్యాకింగ్‌ వ్యవహారంపై యాపిల్‌ సంస్థను పార్లమెంటరీ ప్యానెల్‌ విచారణకు పిలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని