Tamil Nadu: తమిళనాడుకు స్వయం ప్రతిపత్తి.. సంచలన వ్యాఖ్యలు చేసిన డీఎంకే ఎంపీ

తమిళనాడుకు స్వయం ప్రతిపత్తి అంశంపై డీఎంకే ఎంపీ ఏ రాజా సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంత దేశం కావాలని అడిగే పరిస్థితి తీసుకురావద్దని.. రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తి ఇవ్వాలంటూ మరోసారి డిమాండ్‌ చేశారు.

Published : 04 Jul 2022 22:11 IST

‘ప్రత్యేక ప్రాంతం’ డిమాండ్‌ చేసే పరిస్థితులు తేవద్దన్న ఎ.రాజా

చెన్నై: తమిళనాడుకు (Tamil Nadu) స్వయం ప్రతిపత్తి (Autonomy) అంశంపై డీఎంకే ఎంపీ ఎ.రాజా సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంత దేశం కావాలని అడిగే పరిస్థితి తీసుకురావద్దని.. రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తి ఇవ్వాలంటూ మరోసారి డిమాండ్‌ చేశారు. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ పాల్గొన్న వేదికపైనే మాట్లాడిన ఎ.రాజా.. ప్రత్యేక తమిళనాడు (Separate Tamil Nadu) అంశాన్ని ప్రస్తావిస్తూ కొత్త వివాదానికి తెరలేపారు. దీనిపై స్పందించిన విపక్షాలు.. డీఎంకే నేత వ్యాఖ్యలు వేర్పాటువాదులను ప్రోత్సహించేలా ఉన్నాయని మండిపడ్డాయి.

తమిళనాడులోని నామక్కల్‌ జిల్లా బొమ్మకుట్టైలో స్థానిక సంస్థ ప్రతినిధుల మహానాడు జులై 3న జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌తోపాటు ఇతర నేతలు ప్రసంగించారు. ఇదే వేదికపై మాట్లాడిన డీఎంకే ఎంపీ ఏ రాజా.. ‘అన్నాదురై (Annadurai) దారిలో ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్నారు. పెరియార్‌ (Periyar) మార్గంలో వెళ్లేలా మమ్మల్ని నెట్టివేయొద్దు. సొంత దేశం కావాలని అడిగేలా చేయొద్దు. రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తి ఇవ్వండి. అప్పటివరకు మేం విశ్రమించేదే లేదు’ అని సంచలన వ్యాఖ్యాలు చేశారు.

పార్టీ సిద్ధాంతకర్త పెరియార్‌ ప్రత్యేక ప్రాంతంగా విడిపోవాలని చెప్పిన విషయాన్ని రాజా గుర్తుచేశారు. అయినప్పటికీ ప్రజాస్వామ్యం, భారత ఐక్యతను దృష్టిలో పెట్టుకొని ఆ డిమాండును తాము పక్కనపెట్టామన్నారు. ఆ డిమాండును మళ్లీ తెరపైకి తెచ్చే పరిస్థితులను కల్పించవద్దని ప్రధానమంత్రి, హోంమంత్రి అమిత్‌ షాలకు విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు. అందుకే రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తి కల్పించండి అంటూ డీఎంకే పార్లమెంట్‌ సభ్యుడు ఏ రాజా పేర్కొన్నారు. డీఎంకే ఎంపీ చేసిన ఈ వ్యాఖ్యలను భాజపా నేత షెహ్‌జద్‌ పూనావాలా తప్పుపట్టారు. కేంద్రంలో ఉన్న పార్టీని విమర్శించడం పక్కనబెడితే.. ఈ క్రమంలో ‘ఐక్య భారత్‌’ను వ్యతిరేకించడం మొదలుపెట్టారా? అని మండిపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని