Updated : 31 Oct 2021 16:14 IST

Ghatak: శత్రువు పాలిట ‘ఘాతక్‌’..!

 సామాజిక మాధ్యమాల్లో భారత్‌ డ్రోన్‌ సందడి

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

అర్మేనియా-అజర్‌ బైజన్‌ మధ్య జరిగిన నాగర్నో-కారబాకు యుద్ధం తర్వాత ప్రపంచ వ్యాప్తంగా రణక్షేత్రాలు పూర్తిగా మారిపోయాయి. భవిష్యత్తు యుద్ధాలు కేవలం యంత్రాల మధ్యే జరుగుతాయని తేలిపోయింది. ఫలితంగా ప్రపంచంలోని సూపర్‌ పవర్లు ఇప్పుడు మానవరహిత వాహనాలపై దృష్టిపెట్టాయి. భారత్‌ కొంచెం ఆలస్యంగా అయినా ఈ రేసులో అడుగుపెట్టింది. కశ్మీర్‌లోని వాయుసేన స్థావరంపై దాడి తర్వాత డ్రోన్‌ ప్రాజెక్టులను మరింత వేగవంతం చేసింది. భారత్‌ అభివృద్ధి చేస్తోన్న ఓ డ్రోన్‌ వీడియో తాజాగా గత వారం సోషల్‌ మీడియాలో సందడి చేసింది. ఈ ఏడాది భారత్‌ డ్రోన్‌ ప్రాజెక్టులు కీలక దశకు చేరుకొన్నాయనే చెప్పాలి.

ఏమిటీ ఘాతక్‌..?

భారత రక్షణ రంగ పరిశోధనశాలలు అభివృద్ధి చేస్తోన్న మానవ రహిత యుద్ధ విమానం(యూఏసీవీ) పేరు ఘాతక్‌. ఈ ప్రాజెక్టుకు 2016 భారత ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. గత కొన్ని నెలలుగా గుర్తుతెలియని ప్రాంతంలో ఇది ట్యాక్సీ ట్రయల్స్‌ నిర్వహించుకుంటోంది. దీనిపై డీఆర్‌డీవో, రక్షణ శాఖల నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. దీనికి సంబంధించిన సాంకేతికత  ప్రయోగాత్మక ప్రాజెక్ట్‌ అయిన స్విఫ్ట్‌ (స్టెల్త్‌ వింగ్‌ ఫ్లయింగ్‌ టెస్ట్‌బెడ్‌) చిత్రాలు, వీడియోలు సోషల్‌ మీడియాలో దర్శనమిచ్చాయి.  గతంలో దీనికి సంబంధించి సామాజిక మాధ్యమాల్లో వచ్చిన డిజైన్‌ను ఇది పోలి ఉంది. భారత నావికా దళం కూడా భవిష్యత్తులో దీనిని వినియోగించేట్లు సిద్ధం చేస్తున్నట్లు యూరేషియన్‌ టైమ్స్‌ పత్రిక పేర్కొంది. ఈ ప్రాజెక్టు 2024-25లో అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.

ఇటువంటి డ్రోన్లు ప్రపంచంలో మరెక్కడ ఉన్నాయి..

రష్యా వద్ద సుఖోయ్‌-70 ఓక్ట్నిక్‌ పేరిట ఇటువంటి డిజైన్‌ను పోలిన డ్రోన్‌ ఉంది. ఇక చైనా ‘జీజే-11 షార్ప్‌ సోర్డ్‌’ పేరిట ఇటువంటి స్టెల్త్‌ డ్రోన్‌ను అభివృద్ధి చేసింది. ఫ్రాన్స్‌ ‘డసాల్ట్‌ న్యూరాన్‌’ స్టెల్త్‌ డ్రోన్‌ను వాడుతోంది. భారత్‌ అభివృద్ధి చేస్తోన్న ఘాతక్‌ డిజైన్‌కు దీనికి మధ్య చాలా పోలికలు ఉన్నాయి. ఫ్రాన్స్‌ సంస్థ భారత ప్రాజెక్టుకు సాయం చేస్తున్నట్లు వార్తలొచ్చాయి. కానీ, ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. భారత్‌ ఇప్పటికే డసో నుంచి రఫేల్‌ యుద్ధ విమానాలను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.

డ్రోన్ల దండు ప్రాజెక్టు కూడా.. 

ఏకకాలంలో పదుల సంఖ్యలో డ్రోన్లు శత్రువుపై విరుచుకుపడి దాడి చేసేలా భారత్‌ స్వార్మ్‌ టెక్నాలజీని అభివృద్ధి చేస్తోంది. ఆగస్టులో భారతసైన్యం విజయవంతంగా 75 డ్రోన్లను ఏకకాలంలో గాల్లోకి ఎగురవేసి నిర్దేశిత లక్ష్యాలపై అత్యంత కచ్చితత్వంతో దాడి చేసింది. ఇవి ఆత్మాహుతి డ్రోన్ల వలే పనిచేశాయి. భవిష్యత్తులో 1000 డ్రోన్లతో ఏకకాలంలో దాడి చేసేలా టెక్నాలజీని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నాయి. ఇజ్రాయెల్‌ నుంచి కొనుగోలు చేసిన  హరాప్‌ ఆత్మాహుతి డ్రోన్లను ఇప్పటి వరకు వాడుతున్నాం. తాజాగా స్వార్మ్‌ సాంకేతికత అభివృద్ధిలో ప్రైవేటు రంగ కంపెనీలకు భాగస్వామ్యం కల్పించారు.

వడివడిగా తాపస్‌-2 ప్రయోగాలు..

అత్యంత ఎత్తుల్లో ప్రయాణిస్తూ శత్రుస్థావరాలపై నిఘాపెట్టేలా తయారు చేస్తోన్న తాపస్‌-2 డ్రోన్‌ ప్రయోగాలు దాదాపు ఓ కొలిక్కి వచ్చినట్లు సమాచారం. దీనిని రుస్తుం-2 అని కూడా అంటారు. కొవిడ్‌ కారణంగా కొంత జాప్యం జరిగినా.. దీని యూజర్‌ ట్రయల్స్‌ కూడా కొన్నాళ్లలో మొదలు కావచ్చు. ఇక దీనికి ముందు వెర్షన్‌ అయిన తాపస్‌ -1(రుస్తుం-1)ను ఆర్చర్‌ పేరిట సాయుధ డ్రోన్‌గా అభివృద్ధి చేస్తోంది.


Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts