ED : ఎస్‌ఆర్‌ఎస్‌ గ్రూప్‌ ఛైర్మన్‌పై ఈడీ కేసు

స్థిరాస్తులను విక్రయిస్తామని ఎస్‌ఆర్‌ఎస్‌ గ్రూప్‌ మోసం చేసినట్లు ఈడీ ఛార్జిషీట్‌ దాఖలు చేసింది. ఈ మోసం మొత్తం విలువ రూ.2,215.98 కోట్లుగా పేర్కొంది.

Published : 04 Nov 2022 13:26 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: పలు స్థిరాస్తి మోసాలకు పాల్పడిన కేసులో ఎస్‌ఎఆర్‌ఎస్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ అనిల్‌ జిందాల్‌ సహా 19 మంది వ్యక్తులు, సంస్థలపై ఈడీ ఛార్జిషీట్‌ దాఖలు చేసింది. వీరిపై మనీలాండరింగ్‌ నిరోధక చట్టం కింద కేసు నమోదైంది. గురుగ్రామ్‌లోని న్యాయస్థానం ఈడీ ఛార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకొంది. గతంలో ఈ నిందితులపై ఫరీదాబాద్‌, దిల్లీలో నమోదైన 81 ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా ఈడీ మనీలాండరింగ్‌పై దర్యాప్తు చేపట్టింది.  బాధితులకు ఇళ్లు, ఫ్లాట్లు, వాణిజ్య సముదాయాలు కేటాయిస్తామని నిందితులు మోసం చేసినట్లు ఈడీ ఆరోపించింది. వారు ఆ రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టులను బ్యాంకులు, ఫైనాన్సింగ్‌ సంస్థల్లో మార్టిగేజ్ చేసి రుణాలు తీసుకొన్నట్లు వెల్లడించింది. ఆ సొమ్మును సరైన మార్గంలో వినియోగించలేదని తెలిపింది. ఫలితంగా ప్రాజెక్టులు దివాలా తీసినట్లు వివరించింది.  

భారీ ఆదాయాన్ని ఎరగా వేసి పెట్టుబడిదారుల నుంచి ఎస్‌ఆర్‌ఎస్‌ సంస్థకు చెందిన వ్యక్తులు సొమ్మును సేకరించారు. ముఖ్యంగా భారీ మొత్తం సొమ్ము లేదా బంగారం ఇస్తామని ఈ సంస్థ ఆశచూపింది. కొన్నాళ్లు చెల్లింపులు కూడా చేసింది. ఆ తర్వాత పెట్టుబడిదారులకు పోస్టుడేటెడ్‌ చెక్కులు ఇచ్చింది. కానీ, ఆ చెక్కులు బ్యాంకుల్లో చెల్లకపోవడంతో మోసపోయినట్లు బాధితులు తెలుసుకొన్నారు. అప్పటికే ఎస్‌ఆర్‌ఎస్‌ గ్రూప్‌ పలు షెల్‌ కంపెనీలను ఏర్పాటు చేసి సొమ్మును వాటిల్లోకి మళ్లించినట్లు ఈడీ వెల్లడించింది. అనంతరం ఆ డబ్బుతో వ్యక్తిగతంగా ఆస్తులు కొనుగోలు చేసినట్లు తేలింది. ఈ స్కాం మొత్తం విలువ రూ.2,215.98 కోట్లుగా ఈడీ పేర్కొంది. ఇప్పటి వరకు ఈడీ రూ.2,045 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్‌ చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని