Sanjay Raut: శివసేనకు మరో షాక్‌.. సంజయ్‌రౌత్‌కు ఈడీ నోటీసులు

మహారాష్ట్రలో తిరుగుబాటు నేతల నుంచి ఇప్పటికే తీవ్ర సవాల్‌ను ఎదుర్కొంటోన్న శివసేన (Shiv Sena)కు తాజాగా మరో షాక్‌ తగిలింది.

Updated : 27 Jun 2022 14:03 IST

ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నామన్న రెబల్‌ నేతలు

ముంబయి: మహారాష్ట్రలో తిరుగుబాటు నేతల నుంచి ఇప్పటికే తీవ్ర సవాళ్లను ఎదుర్కొంటోన్న శివసేన (Shiv Sena)కు తాజాగా మరో షాక్‌ తగిలింది. మనీలాండరింగ్‌ (Money Laundering) కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ (Sanjay Raut)ను విచారించేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) సిద్ధమైంది. ఇందులో భాగంగా మంగళవారం నాడు హాజరు కావాలని ఆయనకు ఈడీ నోటీసులు జారీచేసింది.

మహారాష్ట్రలోని పాత్రచాల్‌ (Patra Chawl) అభివృద్ధి ప్రాజెక్టులో భూకుంభకోణం జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. రూ.1,034 కోట్ల విలువైన ఈ కుంభకోణానికి సంబంధించిన వ్యవహారంలో సంజయ్‌రౌత్‌కు సన్నిహితుడైన ప్రవీణ్‌ రౌత్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) ఈ ఏడాది ఫిబ్రవరిలోనే అరెస్టు చేయడంతోపాటు ఛార్జిషీట్‌ కూడా దాఖలు చేసింది. ఈ కేసులో సంజయ్‌తోపాటు ఆయన కుటుంబ సభ్యులకు చెందిన రూ.2కోట్ల విలువైన ఆస్తులను ఈ ఏప్రిల్‌లో ఈడీ జప్తు చేసింది. ఆయన భార్యపేరుమీదున్న అలీబాగ్‌లోని ఎనిమిది స్థలాలు, ముంబయిలోని దాదర్‌ సబర్బన్‌లో ఓ ఫ్లాట్‌ను అటాచ్‌ చేసింది. తాజాగా ఆయనను ప్రశ్నించేందుకు సిద్ధమైన ఈడీ.. మంగళవారం హాజరుకావాలని ఆదేశించింది.

మైనారిటీలో మహా ప్రభుత్వం..?

శివసేన అసమ్మతి నేతల తిరుగుబాటుతో మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రతిష్టంభన నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో గత ఆరు రోజులుగా వేచిచూసే ధోరణి అవలంబిస్తోన్న రెబల్‌ నేతలు నేడు కీలక నిర్ణయం తీసుకున్నారు. మహావికాస్‌ అఘాడీ (MVA) ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు వెల్లడించారు. ఇందుకు సంబంధించి నోటీసులు జారీ చేసిన 38 మంది రెబల్‌ ఎమ్మెల్యేలు.. ఇక సంకీర్ణ ప్రభుత్వం మైనారిటీలో పడినట్లేనని అందులో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని