Elephant Rescue: గుంతలో పడిన ఏనుగు.. ‘ఆర్కిమెడిస్‌ సూత్రం’ సాయంతో బయటకు!

ఓ గుంతలో పడిన ఏనుగును బయటకు లాగేందుకు భౌతిక సూత్రాన్ని అమలు చేసిన అటవీశాఖ అధికారులు ఎట్టకేలకు బయటకు తీయగలిగారు.

Updated : 22 Feb 2022 21:21 IST

అటవీశాఖ అధికారుల వినూత్న ప్రయత్నం

కోల్‌కతా: అర్ధరాత్రి సమయంలో ఓ ఏనుగు అనుకోకుండా గుంతలో పడింది. చుక్క నీరులేని ఆ గుంత నుంచి తొండం సాయంతో బయటకు వచ్చేందుకు ఎంతగా ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాలేదు. గజరాజు అరుపులు విని స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు.. దాన్ని రక్షించేందుకు తీవ్రంగా శ్రమించారు. ఎంతైనా భారీ కాయం కదా..! బయటకు లాగే ప్రయత్నాలేవీ ఫలించలేదు. దీంతో చివరకు భౌతికశాస్త్ర సూత్రాన్ని అమలు చేసిన అటవీశాఖ అధికారులు ఎట్టకేలకు ఏనుగును బయటకు తీయగలిగారు. పశ్చిమబెంగాల్‌ మిడ్నాపుర్‌లో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.

ఈ వీడియోను ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీసెస్‌ (IFS) అధికారి పర్వీన్‌ కస్వాన్‌ ట్విటర్‌లో షేర్‌ చేశారు. ‘మిడ్నాపుర్‌లోని ఓ గుంతలో ఏనుగు పడింది. దాన్ని రక్షించడం ఎలా..? ఆర్కిమెడిస్‌ సూత్రాన్ని అనుసరించి బయటకు తీశారు. నమ్మశక్యంగా లేదు కదా! మీరే చూడండి’ అంటూ పర్వీన్‌ ట్వీట్‌ చేశారు.

ఆర్కిమెడిస్‌ సూత్రం ఆధారంగా..

ఒక వస్తువు/శరీరం ద్రవంలో మునిగినప్పుడు కొంత భారాన్ని కోల్పోయినట్లు అనిపిస్తుంది. అందుకు ఆ వస్తువు సాంద్రతే కారణం. నీటి సాంద్రత కన్నా వస్తువు/శరీర సాంద్రత తక్కువగా ఉన్నప్పుడు ఆ వస్తువు నీటిపై తేలుతుంది. ఇదే సూత్రాన్ని అమలుచేసిన అధికారులు.. ఏనుగు పడిన ఆ ఖాళీ గుంతలో నీటిని పోయడం ప్రారంభించారు. గుంతలో నీటి మట్టం పెరుగుతున్నా కొద్దీ ఆ ఏనుగుపైకి రావడం మొదలైంది. అలా ఆ గుంత పూర్తిగా నీటితో నిండే సమయానికి ఏనుగు కూడా పైకి లేచింది. చివరకు తాళ్ల సహాయంతో అధికారులు ఓవైపునకు లాగడంతో గున్న ఏనుగు బయటపడింది.

‘ఏనుగు గుంతలో పడినట్లు అర్ధరాత్రి ఒంటి గంటకు సమాచారం అందింది. వెంటనే ఘటనా స్థలానికి అధికారులు వెళ్లి రక్షించే ప్రయత్నం చేశారు. ఈత, నీటిపై తేలడం వంటి అంశాల ఆధారంగా ఏనుగును కాపాడేందుకు ప్రయత్నించారు. మూడు గంటలపాటు శ్రమించిన అనంతరం చివరకు గజరాజును సురక్షితంగా రక్షించగలిగారు’ అంటూ రెస్క్యూ ఆపరేషన్‌ను వివరిస్తూ మరో ఐఎఫ్‌ఎస్‌ అధికారి సందీప్‌ బర్వాల్‌ ట్విట్‌ చేశారు. ఇలా ఏనుగును కాపాడేందుకు అటవీశాఖ అధికారులు చేసిన కృషిని ట్విటర్‌ యూజర్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని