Gold: 3వేల కేజీల బంగారం పట్టివేత.. అత్యధికంగా ఆ రాష్ట్రంలోనే..

దేశంలోకి అక్రమంగా రవాణా చేస్తోన్న బంగారం (Gold)పై అధికారులు గట్టిగా దృష్టిపెట్టారు. ఈ ఏడాది ఏకంగా 3వేల కేజీలకు పైగా పసిడిని స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్నారు.

Published : 12 Dec 2022 17:36 IST

దిల్లీ: బంగారం (Gold)పై దిగుమతుల సుంకం పెంచడంతో పాటు కరోనా తర్వాత అంతర్జాతీయ విమానాల రాకపోకలు పెరగడంతో దేశంలో పసిడి అక్రమ రవాణా (smuggling) కూడా పెరిగింది. స్మగ్లింగ్‌పై అధికారులు గట్టి నిఘా పెట్టడంతో కొందరు అక్రమ మార్గాల్లో బంగారాన్ని దేశంలోకి తెచ్చేందుకు ప్రయత్నించి దొరికిపోతున్నారు. అలా ఈ ఏడాది ఇప్పటివరకూ దర్యాప్తు సంస్థలు 3వేల కేజీలకు పైగా పసిడిని పట్టుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

ఈ ఏడాది నవంబరు వరకు దేశవ్యాప్తంగా 3,588 కేసుల్లో 3,081.61 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌధరీ సోమవారం పార్లమెంట్‌కు వెల్లడించారు. గత మూడేళ్లలో ఇదే అత్యధిక పట్టివేత కావడం గమనార్హం. 2021లో 2,383 కేజీలు, 2020లో 2,154 కిలోల పసిడిని దర్యాప్తు అధికారులు జప్తు చేసుకున్నారు. 2019లో అత్యధికంగా 3,678 కిలోల అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని దర్యాప్తు సంస్థలు పట్టుకున్నట్లు కేంద్రమంత్రి తెలిపారు.

ఇక, ఈ ఏడాది రాష్ట్రాల వారీగా కేరళలో అత్యధికంగా 690 కేజీల పుత్తడిని స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత మహారాష్ట్రలో 474 కిలోలు, తమిళనాడులో 440 కేజీలు, పశ్చిమ బెంగాల్‌లో 369 కేజీల బంగారం స్మగ్లింగ్‌ను అధికారులు బట్టబయలు చేశారు. పసిడి అక్రమ రవాణాను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుందని కేంద్రమంత్రి పంకజ్‌ తెలిపారు. బంగారాన్ని తీసుకొచ్చేందుకు స్మగ్లర్లు ప్రయోగిస్తున్న కొత్త పద్ధతులకు సంబంధించి ఎప్పటికప్పుడు అధికారులకు సర్క్యులర్లు జారీ చేస్తున్నట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని