Presidential Election: ఇద్దరు వ్యక్తులు కాదు.. రెండు సిద్ధాంతాల మధ్య పోరు!

రాష్ట్రపతి పదవికి (Presidential Election) జరుగుతోన్న ఈ ఎన్నికల్లో నెలకొన్న ఈ పోటీ ఇద్దరు వ్యక్తుల మధ్య కాదని.. కేవలం రెండు సిద్ధాంతాల మధ్యేనని విపక్షపార్టీలు పేర్కొన్నాయి.

Published : 27 Jun 2022 16:01 IST

యశ్వంత్‌ సిన్హా వెంట విపక్షపార్టీల నేతలు

దిల్లీ: రాష్ట్రపతి పదవికి (Presidential Election) జరుగుతోన్న ఈ ఎన్నికల్లో నెలకొన్న ఈ పోటీ ఇద్దరు వ్యక్తుల మధ్య కాదని.. కేవలం రెండు సిద్ధాంతాల మధ్యేనని విపక్షపార్టీలు పేర్కొన్నాయి. విపక్షాల అభ్యర్థిగా రాష్ట్రపతి రేసులో ఉన్న యశ్వంత్‌ సిన్హా (Yashwant Sinha) నామినేషన్‌ దాఖలు చేసిన అనంతరం విపక్ష నేతలు ఈ విషయాన్ని స్పష్టం చేశారు.

‘యశ్వంత్‌ సిన్హాకు ఉమ్మడిగా మేమంతా మద్దతు ఇస్తున్నాం. వ్యక్తిగతంగా మద్దతు ఇస్తున్నప్పటికీ పోటీ మాత్రం రెండు సిద్ధాంతాల మధ్యే. ద్వేషపూరిత ఆర్ఎస్‌ఎస్‌ ఓవైపు.. దయాభావం కలిగిన ప్రతిపక్ష పార్టీలు మరోవైపు’ అని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) పేర్కొన్నారు. ఇక టీఎంసీ నేత మమతా బెనర్జీ కూడా సిన్హాకు తన మద్దతు ప్రకటించారని ఆ పార్టీ నేత సౌగతా రాయ్‌ వెల్లడించారు. ఇది కేవలం మతతత్వం-లౌకికతత్వం, నిరంకుశత్వం-ప్రజాస్వామ్యం మధ్య జరుగుతోన్న పోరు అన్నారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితుల్లో రాష్ట్రపతిగా యశ్వంత్‌ సిన్హానే ఉత్తమమైన అభ్యర్థి అని టీఎంసీ నేత స్పష్టం చేశారు.

రాష్ట్రపతి పదవికి జరుగుతోన్న ఈ పోటీ గుర్తింపు రాజకీయాలకు సంబంధించినది కాదని సీపీఐ-ఎం నేత సీతారాం ఏచూరి పేర్కొన్నారు. ద్రౌపది ముర్ము (Draupadi Murmu) అంటే గౌరవం ఉన్నప్పటికీ.. సిద్ధాంతాల నడుమే అసలైన పోటీ అని స్పష్టం చేశారు. మరోవైపు అధికార ఎన్డీయే కూటమి ప్రతిపాదించిన రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము పట్ల వ్యక్తిగతంగా ఎలాంటి వ్యతిరేకత లేదని టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. కేవలం కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తోన్న నిరంకుశ విధానాల వల్లే భాజపా ప్రతిపాదించిన అభ్యర్థిని తిరస్కరిస్తూ యశ్వంత్‌ సిన్హాను విపక్షాలు బలపరుస్తున్నాయని వెల్లడించారు.

ఇదిలాఉంటే, రాష్ట్రపతి ఎన్నికలో విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా పోటీపడుతోన్న యశ్వంత్ సిన్హా సోమవారం నామినేషన్ వేశారు. దిల్లీలోని పార్లమెంట్ భవనంలో రిటర్నింగ్ అధికారి, రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోదీకి ఈ నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ సమయంలో ఆయన వెంట కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీ, ఎన్‌సీపీ అధినేత శరద్‌పవార్, ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, ఎన్‌సీ అధినేత ఫరూక్ అబ్దుల్లా, తెరాస నేత కేటీఆర్‌తోపాటు పలువురు విపక్షనేతలు ఉన్నారు. అయితే, బీఎస్పీ, బీజేడీ ఇప్పటికే ఎన్డీయే అభ్యర్థి ద్రౌపదీ ముర్ముకు తమ మద్దతును ప్రకటించిన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని