Hydrogen Car: భారత్‌లో తొలి హైడ్రోజన్‌ కారు..!

భారత్‌లో తొలి హైడ్రోజన్‌ కారు అందుబాటులోకి వచ్చింది. పైలట్‌ ప్రాజెక్టులో భాగంగా ఈ కారు పనితీరును కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ నేడు ప్రయోగాత్మకంగా పరిశీలించారు.

Published : 31 Mar 2022 01:21 IST

పార్లమెంట్‌ వరకు ప్రయాణించిన కేంద్ర మంత్రి నీతిన్‌ గడ్కరీ

దిల్లీ: ప్రస్తుతం విరివిగా వాడుతోన్న శిలాజ ఇంధన వనరులకు ప్రత్యామ్నాయ ఇంధనాన్ని తీసుకువచ్చే ప్రయత్నాలు ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్నాయి. వనరులు తరిగిపోవడం, పర్యావరణ కాలుష్యాన్ని అరికట్టే ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా పెట్రోల్‌, డీజిల్‌తోపాటు ఎలక్ట్రిక్‌ ఇంధనాలకు ప్రత్యామ్నాయంగా హైడ్రోజన్‌ ఇంధన వినియోగంపై చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో భారత్‌లో తొలి హైడ్రోజన్‌ కారు అందుబాటులోకి వచ్చింది. పైలట్‌ ప్రాజెక్టులో భాగంగా ఈ కారు పనితీరును కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ నేడు ప్రయోగాత్మకంగా పరిశీలించారు. ఆయన నివాసం నుంచి పార్లమెంటు వరకు హైడ్రోజన్‌ కారులో ప్రయాణించారు.

పెట్రోల్‌, డీజిల్‌, ఎలక్ట్రిక్‌ వాహనాలకు ప్రత్యామ్నాయంగా హైడ్రోజన్‌ ఇంధన వాడకాన్ని కేంద్ర ప్రభుత్వం సిఫార్సు చేస్తోంది. ఇందులో భాగంగా దేశంలో తొలి హైడ్రోజన్‌ కారును కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ గత నెలలోనే విడుదల చేశారు. సమర్థవంతమైన, పర్యావరణ రహిత, స్వయం ఆధారిత ఇంధన మార్గంలో భారత్‌ పయనించేందుకు ఈ గ్రీన్‌ హైడ్రోజన్‌ ఎంతగానో దోహదం చేస్తుందన్నారు. జపాన్‌ సంస్థ టయోటా అందించిన ఈ కారును.. పైలట్‌ ప్రాజెక్ట్‌ కింద తానే మొదటగా వినియోగిస్తానని అప్పట్లో వెల్లడించారు. తద్వారా ప్రజలను ప్రోత్సహించినట్లు అవుతుందన్నారు. ఆ ప్రకారమే నేడు దిల్లీ రోడ్లపై తొలి హైడ్రోజన్‌ కారులో కేంద్రమంత్రి ప్రయాణం చేశారు. ఈ సందర్భంగా ట్విటర్‌లో స్పందించిన ఆయన. ‘భారత్‌ త్వరలోనే గ్రీన్‌ హైడ్రోజన్‌ ఎగుమతి చేసే దేశంగా మారనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దూరదృష్టి, క్లీన్‌ ఎనర్జీకి అనుగుణంగా ‘నేషనల్‌ హైడ్రోజన్‌ మిషన్‌’ కార్యక్రమం ద్వారా స్వచ్ఛమైన, గ్రీన్‌ ఎనర్జీని అందించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉంది’ అని పేర్కొన్నారు.

హైడ్రోజన్‌ కారు ఫీచర్స్‌ ఇవే..

* భారత్‌లో ‘టయోటా మిరాయ్‌ (Toyota Mirai)’ పేరుతో ఈ హైడ్రోజన్‌ కారును టయోటా అందుబాటులోకి తీసుకువచ్చింది.

* హైడ్రోజన్‌ ‘ఫ్యుయల్‌ సెల్‌ ఎలక్ట్రిక్‌ వెహికల్‌ (FCEV)’ సాంకేతిక పరిజ్ఞానంతో దీన్ని రూపొందించారు.

* అధిక పీడనం కలిగిన ట్యాంకులో హైడ్రోజన్‌ను నిల్వ చేస్తారు.

* ఫ్యుయల్‌ సెల్‌ సహాయంతో హైడ్రోజన్‌, ఆక్సిజన్‌ వాయువుల ప్రతిచర్య కారణంగా విద్యుత్‌శక్తి ఉత్పత్తి అవుతుంది.

* ఇలా స్వచ్ఛమైన హైడ్రోజన్‌ నుంచి ఉత్పత్తయ్యే శక్తితో కేవలం నీరు మాత్రమే బయటకు విడుదల అవుతుంది. దీంతో కాలుష్యానికి ఆస్కారం ఉండదు.

* ఒక్కసారి ఫుల్‌ ట్యాంక్‌ చేస్తే 600 కి.మీ వరకు ప్రయాణించవచ్చు.

* ఒక కి.మీ ప్రయాణానికి దాదాపు రూ.2 మాత్రమే అవుతుంది.

* ట్యాంకు నింపడం కూడా కేవలం రెండు, మూడు నిమిషాల్లోనే అవుతుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని